Wednesday, May 8, 2024

29 మంది విద్యార్థినిలకు కరోనా

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. జిల్లా కేంద్రంలో గల బాలికల ఉన్నత పాఠశాలలో 174 మందికి పరీక్షలను నిర్వహించగా 35 మందికి కరోనా నిర్దారణ అయింది. ఇందులో 29 మంది విద్యార్థినిలతో పాటు మరో ఆరుగురు తల్లిదండ్రులకు కూడా కరోనా నిర్దారణ అయింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మంచిర్యాల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు సూచనల మేరకు పాఠశాలలో వైద్య బృంధం ప్రత్యేకంగా విద్యార్థులకు పరీక్షలను నిర్వహించింది. సోమవారం 55 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మంది ఉపాధ్యాయులకు, ఒక విద్యార్థినితో పాటు ఇద్దరు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు కరోనా నిర్దారణౖంది. దీంతో పాఠశాలలో ముందస్తు చర్యలు చేపడుతున్నారు. భౌతిక దూరం పాటిస్తూ కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లాలోని పాఠశాలల నిర్వాహకులకు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులను పాఠశాలలకు పంపించేందుకు వారి తల్లిదండ్రులు జంకుతున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా విజృంభనకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని పలువురు పేర్కొంటున్నారు. మాస్కులు ధరించకపోవడం, సామాజిక దూరం పాటించకపోవడం, ఇష్టానుసారం బహిరంగ ప్రదేశాల్లో తిరగడం, గుమికూడటం లాంటి పనుల చేస్తుండటంతో కరోనా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందని, ప్రభుత్వం సూచించిన మేరకు నిబంధనలను ప్రతీఒక్కరు పాటించాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో 150 మంది విద్యార్థులు,
ఉపాధ్యాయులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా అందరికి కరోనా నెగిటీవ్‌ రిపోర్టు రావడంతో ఆ పాఠశాలలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా సంక్రమణ రోజురోజుకు పెరుగుతుండటాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని, ఇందులో ప్రముఖ పాత్ర విద్యార్థుల తల్లిదండ్రులదేనని అధికారులు పేర్కొంటూ వారికి తగు సూచనలు చేయడంతో పాటు పాఠశాల యాజమాన్యాలకు కూడా ఈ విషయమై ఖచ్చితమైన ఆదేశాలను జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement