Sunday, May 19, 2024

TS | తెలంగాణకు గులాబీ జెండానే శ్రీరామరక్ష.. రోడ్‌ షోలో కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : లోక్‌ సభ ఎన్నికల్లో కుర్‌కురే పార్టీకి… కిరికిరి పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే బీఆర్‌ఎస్‌ పార్టీ ఒక దిక్కు… కుర్‌ కురే బీజేపీ పార్టీ మరో దిక్కు కాగా కిరికిరిల కాంగ్రెస్‌ పార్టీ ఇంకో దిక్కు ఉన్నాయన్నారు. మంగళవారం అంబర్‌ పేట్‌లో జరిగిన రోడ్‌షోలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.

భారాస ఎంపీ అభ్యర్థి పద్మారావు గెలుపు కోసం ప్రచారాన్ని నిర్వహించిన ఆయన.. ఈసారి బీజేపీ 400 సీట్లు అంటోంది. మళ్లీ బీజేపీకి ఓటు వేస్తే పెట్రోల్‌, డీజెల్‌ రూ.400 అవ్వడం పక్కా అని స్పష్టం చేశారు. సిలిండర్‌ను రూ.5 వేలు చేస్తారు. మీకు ఓటు ఎందుకు వేయాలంటే మేము గుడికట్టినం అంటారు. మరి కేసీఆర్‌ యాదాద్రి కట్టలేదా అని ప్రశ్నించారు. గుడి కట్టుడే కారణమైతే కేసీఆర్‌కి ఎన్నో ఓట్లు వేయాలే అన్నారు.

జూన్‌ 2 తర్వాత బీజేపీ వాళ్లు కచ్చితంగా హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారన్నారు. హైదరాబాద్‌ మీద వాళ్లకు పట్టుదొరుకతలేదు. అందుకే ఢిల్లీని చేసినట్లు హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని చూస్తున్నారు. దాన్ని అడ్డుకోవాలంటే బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌లో కచ్చితంగా ఉండాలే. ఇవి ప్రధాని ఎన్నికలు కదా? బీఆర్‌ఎస్‌ గెలుసుడు ఏమీ అవసరమని కొందరంటున్నారు.

గతంలో కూడా ఇట్లనే మాట్లాడారు. కానీ ఐదు మంది ఎంపీలతో కేసీఆర్‌ తెలంగాణ తెచ్చారు. ఢిల్లీ మెడలు, కాంగ్రెస్‌ మెడలు వంచింది కేసీఆర్‌ మాత్రమే. తెలంగాణకు గులాబీ జెండానే శ్రీరామరక్ష. ఐదేళ్లలో కిషన్‌రెడ్డి అంబర్‌ పేట్‌కు ఒక్క రూపాయి తెచ్చిండా? ఒక్క గుడి కట్టిండా, బడి కట్టిండా? ఎందుకు ఓటు వేయాలే అని ప్రశ్నించారు.

ఫించన్‌ రూ.2000 ఎగ్గొట్టిండు.. రేవంత్‌వీ అన్ని మోసాల మాటలే

- Advertisement -

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నేతలే ఆయనపై కోపంగా ఉన్నారన్నారు. బీజేపీ వాళ్లే కిషన్‌రెడ్డి హటావో.. సికింద్రాబాద్‌ బచావో అంటున్నారు. 2014, 2018లో బీజేపోళ్లను ఓడించింది బీఆర్‌ఎస్సే. 2023లో కూడా బీజేపీ తీస్‌మార్‌ ఖాన్లు అని చెప్పుకునేటోళ్లను కూడా బీఆర్‌ఎస్సే ఓడించింది. కాంగ్రెసోళ్లు సిగ్గులేకుండా బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే అంటూ ప్రచారం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తన చెల్లెలు, కేసీఆర్‌ కూతురు 50 రోజులుగా జైల్లో ఉందన్నారు. బీజేపీతో మాకు దోస్తీ ఉంటే మా చెల్లెలు జైల్లో ఉండేదా? అని ప్రశ్నించారు. 2014లో బడేభాయ్‌.. 2023లో చోటా భాయ్‌ మోసం చేసిండన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తే జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నమ్మి మోసపోయారని వెల్లడించారు. రేవంత్‌ రెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలైనయ్‌ అంటూ హోర్డింగ్‌లు పెట్టుకున్నాడు.

లక్షన్నర తులాల బంగారం బాకీ ఉన్నాడంటూ కేటీఆర్‌ మండిపడ్డారు. ఇయ్యకపోతే ఆడబిడ్డలు నీ లగ్గం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 2500 మహిళలకు ఇచ్చినమని రాహుల్‌ గాంధీ చెబుతుండు.. మరి ఎవరికి అయినా వచ్చినయా? అని రోడ్‌ షోకు హాజరైన ప్రజలను ప్రశ్నించారు. వృద్ధులకు రూ.4 వేలు అన్నాడు వచ్చినయా? ఉన్న రూ.2 వేలు కూడా ఎగగొట్టిండు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతుంటే టీవీల ముందు ఫ్యామిలీతో చూసే పరిస్థితి లేదు. నేను లంకెబిందెలు ఉన్నాయనుకొని వచ్చినా అంటాడు.

దొంగలు కదా లంకె బిందెల కోసం తిరిగేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ఉన్నప్పుడే బాగుండే అని అనుకునేటోళ్లకు మంచి ఉపాయం చెబుతా. మీరు చేయాల్సిదల్లా ఒక్కటే. మే 13 నాడు కారు గుర్తు మీద ఓటు వేయండి. 10-12 సీట్లు మాకు అప్పగించండి. 6 నెలల్లోనే కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు. పజ్జన్నకు అంబర్‌పేట్‌లో 50 వేల మెజార్టీ రావాలే.. 24 ఏళ్లుగా కేసీఆర్‌తో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండే పజ్జన్నకు అండగా నిలవాలని కేటీఆర్‌ రోడ్‌ షోలో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement