Wednesday, May 22, 2024

అంతర్జాతీయ స్థాయిలో బొంతపల్లి బొమ్మలకు గుర్తింపు తెస్తాం

బొంతపల్లి కలప ఆట వస్తువుల అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరం

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బొంతపల్లి లో కామన్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం

గుమ్మడిదల – అంతర్జాతీయ స్థాయిలో బొంతపల్లి కలప ఆట బొమ్మలకు గుర్తింపు వచ్చేలా అన్ని విధాలా సహకరిస్తామని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గుమ్మడిదల మండలం వీరన్న గూడెం లో ఏర్పాటుచేసిన కామన్ ఫెసిలిటీ సెంటర్ ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా రామయ్యర్ తో కలసి స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశం చైనా తయారీ వస్తువులతో నిండి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తయారవుతున్న కలప బొమ్మలను కేంద్ర రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చేలా కృషి చేయడంతో పాటు గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు జరిగే ప్రతి కార్యక్రమంలో వీటిని బహుమతుల రూపంలో అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. కలపతో చేసిన బొమ్మలు వాడటం ద్వారా ప్లాస్టిక్ బొమ్మల వినియోగం గణనీయంగా తగ్గి, స్థానిక వ్యాపారులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో ఏర్పాటైన కామన్ ఫెసిలిటీ సెంటర్ నీ మరింత అభివృద్ధి చేసేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. సెంటర్లో తయారవుతున్న కలప బొమ్మల ముడి సరుకు కొరత గురించి సంబంధిత అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. బొమ్మల తయారీకి అవసరమయ్యే కలప కోసం ప్రత్యేకంగా భూమి కేటాయించి మొక్కల పెంపకానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. సెంటర్ లో తయారైన బొమ్మల మార్కెటింగ్కు సంపూర్ణ సహకారం అందిస్తానని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ హనుమంతరావు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శైలజ రామయ్యార్ లు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణ జడ్పిటిసి కుమార్ గౌడ్, సర్పంచ్ మమత, నవీన, ఎంపిటిసి సురభి నాగేందర్ గౌడ్, తాసిల్దార్ సుజాత, ఎంపీడీవో చంద్రశేఖర్, ఆలయ కమిటీ చైర్మన్ భద్రప్ప, వివిధ శాఖల అధికారులు,పాలకవర్గం సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, నాయకులు విజయభాస్కర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వేణు, గౌరీ శంకర్ గౌడ్, హుస్సేన్, ఏజాజ్ పాష, సురభి వినోద్ గౌడ్, చక్రపాణి, వినోద్, రమేష్ అప్ప, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement