Saturday, June 15, 2024

At Last – మాచర్ల వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ ?….

హైదరాబాద్‌: ఈవీఎంను ధ్వంసం చేసి, హింసాత్మక ఘటనలకు పాల్పడిన కేసులో మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ముమ్మరంగా గాలించి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్‌హౌస్‌లో అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు.. ఇస్నాపూర్‌ లోకేషన్ గుర్తించిన మాచర్ల పోలీసులు.. పటాన్‌చెరు పోలీసుల సహకారం తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకోగలిగారు. పోలీసులు ఆయన్ను ఏపీకి తరలించనున్నారు. ఐతే ఈ అరెస్ట్ ను ఇంత వరకూ పోలీస్ లు దృవీకరించ లేదు.

మే 13న మాచర్లలోని పాల్వాయిగేట్ పోలింగ్ బూత్ లోకి వెళ్లిన పిన్నెల్లి.. ఆగ్రహంతో అక్కడున్న ఈవీఎంను ధ్వంసం చేశారు. ఆ వీడియో ఏపీలో సంచలనం రేపింది. వీడియో కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి చేరడంతో.. పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు పిన్నెల్లి కోసం హైదరాబాద్ కు చేరుకున్నారు. పిన్నెల్లి సోదరులు పరారవుతున్నారని తెలిసి వెంబడించగా సంగారెడ్డి వద్ద కార్లను వదిలి వెళ్లారు. అక్కడ కార్లను, డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

- Advertisement -

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మహారాష్ట్ర బీదర్ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందగా.. ఆ మార్గంలో గాలించారు. ఆయన డ్రైవర్ ను రుద్రారం వద్ద అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. మహారాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశారు. పిన్నెల్లిని పట్టుకోవడానికి పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలించారు. బీదర్ వెళ్లాలనుకున్న పిన్నెల్లి.. రూటు మార్చుకున్నట్లు గుర్తించిన పోలీసులు చివ‌ర‌కు ఇస్నాపూర్ గెస్ట్ హౌజ్ లో అదుపుతోకి తీసుకున్నారు.

అంత‌కు ముందు ఏపీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి ముంబై లేదా గోవా పారిపోయేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. అందుకే NH65 మీదుగా పిన్నెల్లి వాహనాలు ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతోనే ఏపీ పోలీసులు పిన్నెల్లి వాహనాలను ఫాలో అయ్యారు.

సంగారెడ్డి పోలీసులకు సమాచారం అందించడంతో రుద్రారం వద్ద పిన్నెల్లి కారును గుర్తించి డ్రైవర్ ను కంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి వాహనంలోనే పోలీసు స్టేషన్ కు తరలించారు. పిన్నెల్లి వదిలి వెళ్లిన ఫార్చూనర్, బొలెరో, ఇన్నోవాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కందిలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు తరలించారు. పిన్నెల్లి అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement