Saturday, April 27, 2024

మహాత్మ జ్యోతిరావు పూలె సేవలు చిరస్మరణీయం..

కవాడిగూడ : మహత్మా జ్యోతిరావుపూలె ప్రజలకు అందించి న సేవలు చిరస్మరణీమని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ పులిగారి గోవర్దన్‌రెడ్డి అన్నారు. అనాదిగా సమాజంలో పాతుకుపోయిన అంతరాల దొంతరలను తొలగించి సమసమాజ నిర్మాణం చేయాలని ఆయన ఎంతగానో కృషిచేశాడని పేర్కొన్నారు. మహాత్మజ్యోతిరావుపూలె జయంతి సందర్భంగా ఆయన పూలె విగ్రహనికి పూలమాలవేసి ఘణంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారినవర్గాల ప్రజల అభివృద్ధి కోసం, వారిలో చైతన్యం తెచ్చి ముందుకు నడిపించడానికి తన జీవితం చివరి వరకు ఆయన అవిరళ కృషిచేశారని పేర్కొన్నారు. దళితులు, అణగారిన వర్గాల ప్రజలు సంఘటితమై తమ హక్కుల సాధనకు బలమైన ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరముందన్నారు. దళితులు అక్షరాస్యులైతేనే తమ హక్కులు సాధించుకోగలుగుతారని, ఏజాతి అభివృద్ధి కైనా విద్య ముఖ్యమని అన్నారు. అణగారిన వర్గాలకు అక్షరజ్ఞానం నేర్పిన మహోన్నత వ్యక్తి మహాత్మ పూలె అని అన్నారు. భారతదేశానికి సరికొత్త సామాజిక విప్లవాన్ని అందించిన మాహానుబావుడని, అంబేద్కర్‌ స్వయంగా పూలెను ఆదర్శవంతుడని ప్రకటించాడని చెప్పారు. ఆనాటి సమాజం లో పెచ్చరిల్లుతున్న అరాచకాలను స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొని స్వయంగా తన భార్య సావిత్రిబాయిని చదివించి భారతదేశానికి ప్రధమ మహిళా ఉపాధ్యాయురాలిని చేశాడని పేర్కొన్నారు. అటువంటి మహనీయుని మార్గంలో అందరు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement