Thursday, May 2, 2024

Pawan Kalyan | విజయానికి 18 రోజుల దూరంలో ఉన్నాం… ఇక అవినీతిపరుల పని పట్టడం ఖాయం

కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఏర్పాటు చేసిన వారాహి విజయభేరి సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. జనసేన పార్టీలో తాను మొదటి తరం రాజకీయ నాయకుడ్ని అని వెల్లడించారు. జగన్ లాగా తాతలు, తండ్రుల నుంచి, 150 సంవత్సరాల నుంచి ఉన్న కాంగ్రెస్ నుంచి వచ్చినవాడ్ని కాదని అన్నారు. ఓ చిన్నపాటి ఉద్యోగి కొడుకునని, ప్రజల అభిమానంతో నటుడిగా ఎదిగానని వెల్లడించారు.

2009లో రాజకీయాల్లోకి వచ్చినా, దాన్ని నిలబెట్టుకోలేకపోయామన్న బాధ ఒకవైపు, రాజకీయాల్లో కొనసాగడం అంత సులభం కాదంటూ వినిపించిన మాటలతో పంతం పట్టి రాజకీయాల్లో కొనసాగానని వివరించారు. ఎవరి ఆసరా లేకపోయినా దశాబ్దకాలంగా పార్టీని నడిపానంటే ప్రజలు ఇచ్చిన బలమే అందుకు కారణమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జగన్ వెళ్లిపోయే సమయం ఆసన్నమైంది. శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి జిల్లాలు, కోనసీమ, రైల్వే కోడూరు, కడప, రాజంపేట, తిరుపతి… ఎక్కడికి వెళ్లినా వైసీపీ ఓడిపోతుంది, ప్రభుత్వం మారిపోతుందన్న విషయం అర్థమైంది అని అన్నారు.

వైసీపీ మరోసారి గెలిస్తే రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉండదు 

వైసీపీ మరోసారి గెలిస్తే రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ ఉండదని పవన్ కల్యాణ్ అన్నారు. సొంతచెల్లెలు వేసుకున్న బట్టలపైనే కామెంట్లు చేసే దిగజారుడు వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని ఘాటుగా విమర్శించారు. చెల్లెలి బట్టలను ఎవరైనా చూస్తారా? ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి? ఇతడు ఎంత దిగజారుడు వ్యక్తి అంటే… మా ఇంట్లో నా భార్యను అన్నాడు, చంద్రబాబు గారి భార్యను అన్నాడు, నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు… ఇవాళ ఇంకా దిగజారిపోయి సొంత చెల్లెల్ని తిడుతున్నాడు. వివేకా కూతుర్ని తిడుతున్నాడు అంటూ పవన్ మండిపడ్డారు.

అంబేద్కర్ వంటి మహనీయుడి పేరు కోనసీమ జిల్లాకు పెడితే ఎవరికి అభ్యంతరం ఉంటుంది? కానీ కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ యత్నిస్తోంది. వ్యక్తుల మధ్య గొడవలు కులాల మధ్య గొడవలు అయిపోతున్నాయి. జగన్ లాంటి గూండాలకు, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వంటి దోపిడీదారులకు భయపడం. నేను మిథున్ రెడ్డికి, పెద్దిరెడ్డికి, జగన్ కు ఒకటే చెబుతున్నా… ఇక్కడుంది జనసేన… మీకు భయపడే పార్టీ కాదు. మీరు ఒక చెయ్యి ఎత్తితే మేం లక్ష చేతులు ఎత్తుతాం” అంటూ పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

- Advertisement -

అవినీతిపరుడ్ని బయటికి లాక్కొచ్చి జరిమానా కట్టేలా చేస్తాం..

రైతుల గురించి, రైతుల కష్టాలు, సమస్యల గురించి తెలియని అనంతబాబుకు వ్యవసాయ సహకార సంస్థకు చైర్మన్ పదవి ఇచ్చారు. జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక రైతాంగం కోసం ఎంత బలంగా నిలబడుతుందో మీరే చూస్తారు. ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటేనే పోలీసులు కేసులు పెడతారు, జగన్ పై గులకరాయి విసిరితే ఓ కుర్రాడ్ని పట్టుకున్నారు. కానీ ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ ను ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతీగతీలేదు. ఇప్పుడదే ఎమ్మెల్సీ రోడ్డుపైకి వచ్చి వైసీపీకి ఓట్లు వేయాలని అడుగుతున్నాడు.

రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేదలకు సెంటు ఇళ్ల పట్టాల విషయంలో వేల కోట్ల అవినీతి జరిగిందని, అందులో రాపాకకు కూడా చిన్నపాటి వాటా ఉందని ఆరోపించారు. పేదలకు ఇళ్లు కట్టలేని ఈ ఎమ్మెల్యే మలికిపురం మండలం కత్తిమండలంలో ఐదు ఎకరాల్లో భవనం కట్టుకున్నాడని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఇనుమును కూడా వ్యాపారుల నుంచి బెదిరించి తీసుకున్నారని ఆరోపించారు. ప్రైవేటు స్థలంలో ప్రభుత్వ నిధులతో ఇల్లు కట్టుకున్న వ్యక్తి రాజోలు ఎమ్మెల్యే అంటూ పవన్ ధ్వజమెత్తారు. అంతర్వేదిలో రథం కాలిపోతే ఇప్పటివరకు దానిపై ఒక్క కూడా మాట్లాడలేదని అన్నారు. ‘‘వైసీపీ నేతలకు ఒకటే చెబుతున్నా… మరో 18 రోజుల తర్వాత మేం గెలుస్తున్నాం… ఒక్కొక్క అవినీతిపరుడ్ని మేం బయటికి లాక్కొచ్చి జరిమానా కట్టేలా చేస్తాం అని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement