Monday, May 13, 2024

తిరుమల గూడెంలో త్రాగునీటి గోస

కాసిపేట: ఊరిలో ఉన్నది ఒకటే చేతి పంపు. ఎండకాలం వచ్చిందంటే అది ఎండిపోతుంది. దాంతో గూడెంలో త్రాగునీటి ఎద్దడి పీడిస్తూ ఉంటుంది. శాశ్వత పరిష్కారం కోసం యేండ్ల నుండి వేడుకుంటున్నా పట్టించుకునేటోళ్లే
లేరు. ఇది ఆ గిరిజన గూడెం ప్రజల ఆవేదన. కాసిపేట మండలం రొట్టెపల్లి గ్రామపంచాయితీ పరిధిలోని కొత్త తిరుమలాపూర్‌ గిరిజన గూడెంలో 21 ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయి. ఆ గిరిజనుల అవసరాలను తీర్చేందుకు ఉన్నది ఒకటే చేతి పంపు. వర్షాకాలం, శీతాకాలం ఉన్న నీటితో అవసరాలను తీర్చుకుంటున్న గిరిజనులకు ఎండాకాలం వస్తుందంటేనే భయపడిపోతుంటారు. అటవీ ప్రాంతం కావడంతో భూగర్భజలాలు అడుగంటిపోయి చేతిపంపు ఎండిపోయి దాంతో చెలిమల నీటిపై ఆధారపడాల్సిన పరిస్థితి. మైళ్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న వాగుల, చెలిమల నీరును తీసుకువచ్చుకుంటూ ఇంటి అవసరాలను తీర్చుకుంటున్నారు. ఈ యేడాది ఎండలు ముదరకముందే గూడెంలోని బోరు చెడిపోవడంతో గిరిజన గూడెంలో త్రాగునీటికి తన్లాట మొదలైంది. సమస్య తీవ్రం కాకముందే చేతిపంపుకు మరమ్మత్తులు చేయాలని స్థానిక సర్పంచ్‌ దృష్టికి తీసుకుపోయినా స్పందించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల మొదటి వారంలో గూడెంలో పెళ్లి జరిగితే కుటుంబసభ్యులంతా, పెళ్లికి వచ్చిన బంధువులు మంచినీటి కోసం వాగుకు పరిగెత్తే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బోరు మరమ్మత్తుల కోసం చందాలు వేసుకొని ఇస్తామన్నా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గూడెంలో మిషన్‌ భగీరథ పనులు జరుగుతున్నా అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందని వారు పేర్కొన్నారు. యేటా ఎండాకాలంలో త్రాగునీటి సమస్యను అధికారుల దృష్టికితి తీసుకువెళ్తే నామమాత్రంగా ట్యాంకర్‌ ద్వారా నీటిని అందించి మర్చిపోతారని, మాకు మాత్రం చెలిమల నీరే దిక్కు అవుతుందని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా స్థానిక సర్పంచ్‌, మండల అధికారులు గ్రామంలో త్రాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని గిరిజనులు వేడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement