Monday, July 22, 2024

TS: పోలింగ్ సామాగ్రితో తరలిన సిబ్బంది.. సమస్యాత్మక కేంద్రాలపై పోలీసుల డేగకన్ను..

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ప్రభ న్యూస్: పకడ్బందీ ఏర్పాట్ల మధ్య సోమవారం నిర్వహించే లోక్ సభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు గావించింది. ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పోలింగ్ నిర్వహణకు 10,548 మంది సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్, బోత్, ఉట్నూర్, నిర్మల్, బైంసా, ఆసిఫాబాద్, సిర్పూర్ టి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల నుండి పోలింగ్ సామాగ్రితో పోలింగ్ అధికారులు, సిబ్బంది బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. బోత్, ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాలను రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ గౌస్ అలం సందర్శించి పోలింగ్ సిబ్బందికి బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసులకు పలు సూచనలు జారీ చేశారు.

లోక్ స‌భ పరిధిలో 2200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 16లక్షల 52 వేల 148 మంది ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని తెలిపారు. వేసవి తాపం, అకాల వర్షాల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు, తాగునీటి వస్తే ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల్లో మూడంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా బందోబస్తు చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు.

కాగా పోలింగ్ సిబ్బంది ఆదివారం సాయంత్రం వరకు అన్ని గ్రామాలకు సురక్షితంగా చేరుకున్నారు. సోమవారం ఉదయం 5:30 గంటలకు మాక్ పోలింగ్ అనంతరం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆసిఫాబాద్, సిర్పూర్ టీ మంచిర్యాల, చెన్నూర్ బెల్లంపల్లి నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. లక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పారా మిలిటరీ బలగాలు బందోబస్తు పర్యవేక్షిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement