Tuesday, May 14, 2024

Perth | అసీస్ ఫాస్ట్ బౌలింగ్ ను అడ్డుకున్న పాక్….

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాకిస్తాన్‌ తొలి టెస్టులో భాగంగా బౌలింగ్‌లో విఫలమైనా బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ధీటుగా బదులిస్తోంది. ఆసీస్‌ పేస్‌ త్రయం మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హెజిల్‌వుడ్‌, పాట్‌ కమిన్స్‌లను తట్టుకుని రెండో రోజు ఆట ముగిసేసమయానికి పాకిస్తాన్‌.. 53 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌.. 113.2 ఓవర్లలో 487 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలి టెస్టు ఆడుతున్న పాక్‌ ఆల్‌ రౌండర్‌ అమీర్‌ జమాల్‌ ఆరు వికెట్లతో అదరగొట్టాడు.

పెర్త్‌ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో ఆసీస్‌.. డేవిడ్‌ వార్నర్‌ (164) తో పాటు మిచెల్‌ మార్ష్‌ (107 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్‌ (42), ఇమామ్‌ ఉల్‌ హక్‌ (38 బ్యాటింగ్‌) లు తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. 36 ఓవర్ల పాటు ఆడి 74 పరుగులు జోడించిన ఈ జోడీని ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌ విడదీశాడు.

షఫీక్‌ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ (43 బంతుల్లో 30, 5 ఫోర్లు) వేగంగా ఆడాడు. రెండో వికెట్‌కు ఈ ఇద్దరూ 49 పరుగులు జోడించారు. అయితే ఆట మరో నాలుగు ఓవర్లలో ముగుస్తుందనగా.. స్టార్క్‌ వేసిన 50వ ఓవర్లో మూడో బంతికి మసూద్‌, వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. రెండో రోజు ఆట ముగిసేసమయానికి పాకిస్తాన్‌ 53 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఇమామ్‌ ఉల్‌ హక్‌, ఖుర్రమ్‌ షాజాద్‌ (7 బ్యాటింగ్‌)లు క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఇంకా 355 పరుగులు వెనుకబడి ఉంది. బాబర్‌ ఆజమ్‌తో పాటు సౌద్‌ షకీల్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌, అగా సల్మాన్‌, ఫహీమ్‌ అష్రఫ్‌లు బ్యాటింగ్ రావలసి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement