Monday, May 27, 2024

కూల్చివేతలు.. ద్వేషాగ్నులు..

అక్రమ నిర్మాణాలనూ, కట్టడాలనూ పుర, నగర పాలక సంస్థల్లో ప్రణాళికా విభాగం అధికారులు కూల్చి వేయడం ఎప్పుడూ జరిగేదే. అయితే, తాజా బుల్‌డోజింగ్‌ ప్రక్రియ ఆ కోవలోకి రాదు. కూల్చివేతలనే వాడుక పదం స్థానంలో బుల్‌డోజింగ్‌ అనే పదం తెరమీదికి వచ్చిందంటేనే ఇందులోని తీవ్రత, రాజకీయ కోణం అర్థమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో యోగీ ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకించి ఒక వర్గం వారికి చెందిన అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చి వేస్తోందంటూ సమాజంలో గౌరవ స్థానానికి చెందిన సుప్రీంకోర్టు, హైకోర్టుమాజీ న్యాయమూర్తులు ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి సంయుక్తంగా ఒక లేఖ రాశారు. దానిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ అక్రమ కట్టడాలు, నిర్మాణాల కూల్చివేత విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకోవాలనీ, మత, కుల పరమైన ద్వేషాలతో, కక్షలతో వ్యవహరించరాదని స్పష్టం చేసింది. ఢిల్లిలో ఆ మధ్య కూల్చివేతలు జరిగినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇదే మాదిరిగా సలహా ఇచ్చింది. ఢిల్లిలోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ కూల్చివేతలకు పాల్పడింది బీజేపీ నగరపాలక సంస్థలే. ఈ ఘటనల్లో నష్టపోయింది ఆవలి వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. నిజానికి కూల్చివేతలనేవి రాజకీయ నాయకుల పలుకుబడి, ప్రతిష్టలకు సంబంధించినవి కాబట్టి వారి జోక్యం ఉంటుందనడంలో సందేహం లేదు. ఎవరు అధికారంలో ఉంటే వారు ప్రత్యర్ధులకి చెందిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంటారు. బీజేపీ అధికారంలో ఉన్న కార్పొరేషన్‌ అధికారులు ఈ పనికి పూనుకోవడం వల్ల బీజేపీయే చేయిస్తోందన్నది ప్రత్యర్ధి వర్గాల అపోహ, అనుమానం.

దీనిపై కేంద్రం వివరణ ఇవ్వాలి. కానీ, ఇవ్వ లేదు. ఆరోపణలు, ప్రత్యారోపణలు వింటూ ఆనందాన్ని పొందుతున్నట్టుగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రా, ప్రయాగ్‌ రాజ్‌, తదితర నగరాల్లో ముస్లింల ఆస్తుల కూల్చివేతలు జరిగాయని ఆరోపిస్తూ వేలాది మంది ముస్లింలు మహిళలతో సహా లక్నోలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. రాజకీయ నాయకులు స్వీయ లబ్ది కోసం ఇలాంటి సంఘటనలకు మతం రంగు పులుముతున్నారు. వారిఅనుమానాలకు ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్‌ ప్రకటనలు, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుని వచ్చిన బుల్‌డోజర్‌ చట్టం ఆజ్యం పోస్తున్నాయి. అయితే, ఆవలి వర్గం వారు ఈ కూల్చివేతలు మతపరంగా సాగుతున్నాయని సోదాహరణగా పేర్కొంటున్నారు. బీజేపీ నుంచి ఇటీవల సస్పెండ్‌ అయిన నుపుర్‌ శర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళనలను నిర్వహించిన జావేద్‌ అహ్మద్‌ అనే నాయకునికి చెందిన ఇంటినే నగరపాలక అధికారులు కూల్చివేశారు. ఇది ముఖ్యమంత్రి ప్రోద్బలంపైనే జరిగిందనేది అహ్మద్‌ అనుచరుల ఆరోపణ. యోగీ ఆదిత్యనాథ్‌ ప్రకటనలు రెచ్చగొట్టే రీతిలో ఉంటున్నాయని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో నడుస్తున్నది భారత రాజ్యాంగం కాదనీ, యోగీ రాజ్యాంగమనీ, ఆయనను అదుపు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ చర్యలు తీసు కోవడం లేదని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. అసెంబ్లి ఎన్నికలు అయిపోయాయి కనుక, ఇక ఎలా వ్యవహరించినా ఇబ్బంది లేదనే ధోరణిలో యోగీ వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

బుల్‌డోజర్‌ చట్టాన్ని మాజీ న్యాయమూర్తులు తప్పు పడుతున్నారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇలాంటి చట్టాన్ని ఇంత వరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ తీసుకుని రాలేదని వారు స్పష్టం చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేతలు ఎంతో కాలంగా జరుగుతున్నాయి. అలాగే, రాజకీయ నాయకుల జోక్యంతో కూల్చివేతలు జరగడం, పైనుంచి వచ్చిన ఉత్తర్వులతో కూల్చివేతలను నిలిపివేయడం కూడా దశాబ్దాలుగా జరుగుతున్నాయి. నగర, పురపాలక సంస్థల్లో పార్టీలతోసంబంధం లేకుండా ఇలాంటి విషయాల్లో ఒకరికొకరు లోపాయికారీగా సహకరించుకోవడం మామూలే. కానీ, యోగీ ప్రభుత్వం ఈ కూల్చివేతల అంశాన్ని ఎందుకింత తీవ్రతరం చేస్తోందో అర్ధం కావడం లేదు. రాజకీయాల్లో విభేదాలుండవచ్చు కానీ, శత్రుత్వం మంచిది కాదు.విద్వేష బీజాలను నాటడం ప్రమాదకరం. అవి సమాజంలో ఉన్న సామరస్య వాతా వరణాన్ని భగ్నం చేస్తాయి. ఇది పూర్తిగా నగర పాలక సంస్థ పరిధిలోని అంశం కనుక యోగీ మాట్లాడకుండా ఉండి ఉంటే, పరిస్థితి ఇంత తీవ్ర రూపం దాల్చేది కాదు. ఇప్పటికైనా విద్వేషాగ్నిని చల్లార్చడానికి చర్యలు తీసుకోవాలి, లేనిపక్షంలో అతిపెద్ద రాష్ట్రంలో ప్రారంభమైన ఈ విద్వేషాగ్ని వ్యాపించే ప్రమాదం ఉంది. భవనాల కూల్చి వేత అంశంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిపై గవర్నర్‌ స్పందించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. అయితే గవర్నర్‌ నోరు మెదపకపోవడం పై నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement