Sunday, May 26, 2024

Paytm | పేటీఎంకు స్టార్టప్‌ల మద్దతు..

ఆర్‌బీఐ ఆంక్షలతో సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న ‘పేటీఎం’కు స్టార్టప్‌ కంపెనీల వ్యవస్థాపకులు పలువురు మద్దతుగా నిలిచారు. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌)పై విధించిన నిషేధాన్ని సమీక్షించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖ రాసినవారిలో పాలసీ బజార్‌ ఫౌండర్‌ యాశిష్‌ దాహయా, భారత్‌ మ్యాట్రిమోనీ వ్యవస్థాపకుడు మురుగావెల్‌ జానకీరామ్‌, మైక్‌ మై ట్రిప్‌ ఫౌండర్‌ రాజేశ్‌ మాగోవ్‌, ఇన్నోవ్‌ 8 వ్యవస్థాపకుడు రితేశ్‌ మాలిక్‌ తదితరులు ఉన్నారు. పేటీఎంపై విధించిన నిషేధాజ్ఞలు, కేవలం ఆ సంస్థపైనే కాక ఫిన్‌టెక్‌ సంస్థల లావాదేవీలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఈ నెల 29 తర్వాత కీలక బ్యాంకింగ్‌ సేవలను నిలిపివేయాలని జనవరి 31న పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకింగ్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌)ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే.

పేటీఎంతో చర్చలు అవాస్తవం: జియో

- Advertisement -

పేటీఎం వాలెట్‌ను కొనుగోలు చేసేందుకు ఎలాంటి చర్చలు జరగలేదని జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ స్పష్టం చేసింది. ఊహాజనిత నివేదికల నేపథ్యంలో జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీవివరణ ఇచ్చింది. పేటీఎం కూడా ఒక క్లారిఫికేషన్‌లో, ”మేము ఈ విషయంలో ఎటువంటి చర్చలు జరపలేదు. మా అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ ద్వారా మాకు సమాచారం అందించబడింది. వారు కూడా ఈ విషయంలో ఎటువంటి చర్చలు జరపలేదు” అని తెలిపింది.

ఆర్‌బీఐ నివేదిక కోరిన ఈడీ

పేటీఎం వ్యవహారంపై ఈడీ దృష్టిసారించింది. మనీలాండరింగ్‌ కింద ఏమైనా నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనేదానిపై దర్యాప్తు చేయడానికి సిద్ధమవుతోంది. ఈడీతోపాటు ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐయూ) కూడా రంగంలోకి దిగుతోంది. ఈ మేరకు ఆర్‌బీఐ నుంచి ఈ రెండు సంస్థలు నివేదిక కోరినట్లు సమాచారం. తమపై ఈడీ దర్యాప్తులేమీ లేవని వన్‌97 కమ్యూనికేషన్స్‌ సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ ప్రకటించిన నేపథ్యంలో ఈడీ, ఎఫ్‌ఐయులు ఆర్‌బీఐని నివేదిక కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement