Sunday, June 23, 2024

TG | బంజారాహిల్స్ లో కుప్పకూలిన నిర్మాణంలోని సెల్లార్

బంజారాహిల్స్ (ప్రభన్యూస్) : బంజారాహిల్స్ లోని విరించి ఆసుపత్రి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సెల్లార్ పనులతో ఒక్కసారిగా కుప్పకూలిన ప్రహరీ గోడ. వివరాల్లోకి వెళితే బంజారాహిల్స్ లో అడ్డగోలుగా అక్రమంగా సెల్లార్ పనులు చేపడుతుండడంతో పక్కనే ఉన్న భారీ ప్రహరీ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఖైరతాబాద్ పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

ఘటన స్థలంలో స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం సెల్లార్ పనులు చేపట్టిన స్థలం, విరించి ఆసుపత్రికి స్థలంగా పేర్కొన్నారు. ఆ స్థలం గత కొంత కాలంగా చెత్త చెదారాలతో నిండి ఉండేదని అన్నారు. కాగా ఇటీవల కాలంలో అట్టి స్థలంలో భారీ సెల్లార్ పనులు చేపట్టారని, అడ్డగోలుగా, అక్రమంగా సెల్లార్ పనులు చేపట్టడంతో పక్కనే ఉన్న భవన సముదాయంలోని హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు ప్రాంతంలోని ప్రహరీ గోడ ఒక్కసారిగా కుప్పకూలిందన్నారు.

కాగా అక్రమంగా, ప్రమాదకరంగా చేపడుతున్న సదరు సెల్లార్ పనులపై స్థానికంగా ఉండే పలువురు గతంలోనే ఖైరతాబాద్ జోన్ మున్సిపల్ కార్యాలయంలోని సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేయగా నోటీసు లు జారీ చేస్తూ సెల్లార్ పనులను నిలిపివేసినట్లు సమాచారం. కాగా తిరిగి పనులు చేపట్టిన నేపధ్యంలో శనివారం ఒక్కసారిగా ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement