Monday, June 17, 2024

TS | రాష్ట్రంలో కొత్తగా 20 కేజీబీవీలు.. కేంద్రం అనుమతి రాగానే ప్రారంభం !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 20 కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)లు ఏర్పాటు కానున్నాయి. వీటితోపాటు మరో 22 కేజీబీవీలు ఇంటర్మీడియట్‌ వరకు అప్‌గ్రేడ్‌ కానున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 20 కేజీబీవీలను ఏర్పాటు చేయడానికి.. అలాగే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న వాటిలో 22 కేజీబీవీ పాఠశాలలను ఇంటర్మీడియట్‌ వరకు అప్‌గ్రేడ్‌ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. అయితే వాటికి సంబంధించిన అనుమతిని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపర్చలేదు. ఈ నెల 15, 16 తేదిల్లో ఢిల్లీలో జరగనున్న ప్లానింగ్‌ ఆప్రూవల్‌ బోర్డు (పీఏబీ) సమావేశంలో చర్చించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం వీటిపై తమ నిర్ణయం తెలియజేయనుంది.

కేంద్రం కొత్త కేజీబీవీలకు అనుమతి ఇస్తేగనుక వచ్చే విద్యా సంవత్సరం 2024-25 నుంచి రాష్ట్రంలో అదనంగా మరో 20 కేజీబీవీలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాల విభజనతో రాష్ట్ర ప్రభుత్వం పలు మండలాలను విభజించి కొత్త మండలాలను ఏర్పాటు చేసిన చోట, ఉపాధి కోసం వలసలకు వెళ్తున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో కేజీబీవీలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే 22 కేజీబీవీలకు ఇంటర్మీడియట్‌ వరకు అనుమతి ఇస్తే.. వచ్చే విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు తీసుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement