Sunday, June 16, 2024

AP | బంగాళాఖాతంలో బలపడనున్న వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన

తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం శనివారం రాత్రి తుపానుగా బలపడి రేపు ఉదయం ఉత్తర దిశగా పయనించి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలోని సాగర్ ద్వీపం-ఖేపుపారా తీరాన్ని దాటుతుందని విపత్తు ఏజెన్సీ ఎండి రోణంకి కూర్మనాథ్ వివరించారు. అదేవిధంగా, దక్షిణ కేరళ పరిసరాల్లో సముద్రమట్టానికి సగటున 5.8కిమీ వరకు ఆవర్తనం విస్తరించి ఉందని మరో ఆవర్తనం ఈశాన్య మధ్యప్రదేశ్ సమీపంలో విస్తరించిందని తెలిపారు. రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతుందన్నారు.

అయితే వీటి ప్రభావంతో రేపు ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. వర్షాల నేప‌థ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించారు.

ఈరోజు (శనివారం) సాయంత్రం 6 గంటల నాటికి అనంతపురం రాయదుర్గంలో 38.5మిమీ, విజయవాడ తూర్పులో 34.5మిమీ, గుంటూరు జిల్లా తాడేపల్లిలో 30.5మిమీ, ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 30.5మిమీ, విజయవాడ సెంట్రల్‌లో 30.2మిమీ, కృష్ణా జిల్లా ఉంగుటూరులో 29.2మిమీ, ఏలూరు జిల్లా నూజివీడులో 27.2మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని తెలిపారు. దాదాపు 25 ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement