Saturday, April 27, 2024

పేదలకు ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే అరూరి

తెలంగాణ రాష్టంలో ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ కడిపికొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు భీమా, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, కంటి వెలుగు పథకాలను ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలని దేశ ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోవాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రజల దగ్గరికి ప్రభుత్వం వస్తోందని, తెలంగాణ ఏం చేస్తే దేశం అదే అనుసరిస్తుందని వెల్లడించారు. దేశానికి దిస్కూచిలా తెలంగాణ మారిందని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట, గౌరవం పెంచడంతో పాటు ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు. మన రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని తెలిపారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన కార్యక్రమాలను మేచుకొన్నారని తెలిపారు. కంటి చూపు లేమితో బాధపడే వారి జీవితంలో ఈ కార్యక్రమం వెలుగు నింపుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్ రావు, జిల్లా రైతు బందు సమితి అధ్యక్షురాలు లలితా యాదవ్, దర్గా సొసైటీ చైర్మన్ వనం రెడ్డి, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు సంపత్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ రమేష్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు,వైద్య అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement