Wednesday, May 22, 2024

ఛార్జీల బాదుడుకు ఆర్టీసీ సిద్ధం…

హైదరాబాద్‌, : ఆర్టీసీ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. కొన్నేళ్ళుగా నష్టాలలో కూరుకుపోయిన ఆర్టీసీ ప్రస్తుతం సిబ్బందికి జీతాలు చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. నిర్వహణ కూడా భారంగా మారింది. అసలే అరకొర జీతాలతో కొనసాగుతున్న ఆర్టీసీ ఉద్యోగులు జీతా లను పెంచాలంటే ఎప్పటికప్పుడు సంస్థపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటు ఆదాయం సరిపోక, అటు సిబ్బందికి జీతాలను చెల్లించలేక సతమతమవుతున్న ఆర్టీసీ ఛార్జీలను పెంచడం తప్ప మరో మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చింది. 2019లో దీర్ఘకాలంగా సాగిన సమ్మె అనంతరం కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున ఛార్జీలను పెంచిన కార్పొరేషన్‌ మరోసారి ఛార్జీలను పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. ఈసారి కిలోమీటర్‌కు కేవలం 15 పైసలు పెంచాలని పేర్కొంటున్న అధికారులు ఏటా ప్రయాణికులపై రూ.800 కోట్ల భారం వేసేందుకు సన్నద్ధమయ్యారు. కేవలం ఏడాదిన్నర క్రితమే ఛార్జీలను పెంచినప్పటికీ నష్టాలు తప్పడం లేదని, నష్టాల భారి నుంచి భయపడాలంటే మరోసారి ఛార్జీలను పెంచేందుకు అనుమతించాలని అధికారులు కోరుతున్నారు.
ఆర్టీసీకి ప్రస్తుతం రోజుకు రూ.11 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఇది ఏ మూలకూ సరిపోవడం లేదు. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు నాలుగు నెలలు బస్సులు రోడ్డెక్కలేదు. అయినప్పటికీ కార్మికులకు వేతనాలను చెల్లించాల్సి వచ్చింది. 2020 ఫిబ్రవరి నుంచి 2021 ఫిబ్రవరి వరకు డీజిల్‌పై రూ.17లు పెరిగింది. వాస్తవానికి డీజిల్‌ లీటర్‌పై ఒక్క రూపా యి పెరిగితే ఆర్టీసీకి ఏడాదికి రూ.22 కోట్ల భారం పడుతుంది. ఈ లెక్కన ఇప్పటి వరకు ఆర్టీసీపై దాదాపు రూ.430 కోట్ల వరకు భారం పడింది. ప్రస్తుతం ఆర్టీసీ రోజుకు ఆరు లక్షల లీటర్ల డీజిల్‌ను వాడుతోంది. దీంతో ఒక్క నెలలోనే డీజిల్‌ కోసం దాదాపు రూ.12 కోట్లను అదనంగా చెల్లించాల్సి వస్తోం ది. టికెట్ల అమ్మకాల ద్వారా రూ.3976 కోట్ల ఆదాయం సమ కూరుతోంది. షాపుల అద్దెలు, వ్యాపార ప్రకటనలు, పార్సిళ్ళు తదితర టిక్కెట్లేతర ఆదాయం ద్వారా వెయ్యి కోట్లు సమకూ రుతున్నాయి. మొత్తంగా ఆర్టీసీ ఏటా రూ.4880 కోట్లను ఆర్జిస్తోంది. ఇంత సంపాదిస్తున్న సంస్థ అంతకంటే వెయ్యి కోట్ల అదనపు ఖర్చు పెడుతోంది. ఖర్చులో సింహభాగం డీజిల్‌, సిబ్బంది వేతనాలకే వెచ్చించాల్సి వస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరం 2020 – 2021లో మొదటి తొమ్మిది మాసాలు ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.1800 కోట్ల నష్టాన్ని మూట గట్టుకుంది. వీటన్నింటినీ అధికారులు తమ ఛార్జీల పెంపు ప్రతిపాదనలలో సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకు వెళ్ళారు. లగ్జరీ, ఏసీ బస్సులలో కనీసం 15 పైసలు పెంచాలని, ఆర్టీనరీ, పల్లెవెలుగు లాంటి బస్సులలో కనీసం 10 పైసలైనా పెంచాలని ప్రతిపాదించారు. కనీస ఛార్జీలను కూడా పెంచాలని, నామమాత్రంగా ఛార్జీలను పెంచడం ద్వారా పేద ప్రజలపై భారం ఉండదని అధికారులు అంటున్నారు. ఛార్జీల పెంపును ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమలులోకి తీసుకురావాలని, లేకపోతే సంస్థ మనుగడ మరింత ప్రశ్నార్థకమవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సంపాదనలో అధికభాగం జీతాలు, డీజిల్‌పైనే వెచ్చిస్తుండటంవల్ల సంస్థ కొత్త బస్సులను కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉందని, కొత్త బస్సుల కొనుగోలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే తప్ప సాధ్యమయ్యే పరిస్థితి లేదని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement