Friday, April 26, 2024

ప్రైవేటు అంబులెన్స్‌ల ఇష్టారాజ్యం.. కోవిడ్‌ బాధితులకు చుక్కలు..

టార్గెట్‌ ..కోవిడ్‌ పాజిటివ్‌లు !
బాధితుల తరలింపులో దోపిడీ
మృతదేహం రవాణాకు రెండింతల
ప్రభన్యూస్‌ ప్రతినిధి, వికారాబాద్‌ : కొందరు వ్యక్తులు..కొన్ని సంస్థలు నిన్నమొన్నటి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల ముందు సేవ పేరుతో నిలిపి ఉంచిన అంబులెన్స్‌లు ఇప్పుడు కోవిడ్‌ బాధితులకు చుక్కలు చూపిస్తున్నాయి. సేవ ముసుగులో అంబులెన్స్‌ సేవలను ప్రారంభించి ఇప్పుడు అచ్చం ధనార్జనకు తెరలేపారు. కోవిడ్‌ బాధితుల తరలింపుకు ఒక ధర..మృతదేహం తరలింపుకు ఒక ధరను వసూలు చేస్తూ అందినంతా దోచుకుంటున్నారు. ప్రభుత్వ అంబులెన్సులు లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారీతిన కోవిడ్‌ బాధితులను దోపిడీ చేస్తున్నారు.

జిల్లా రవాణా శాఖ అధికారులు గాఢ నిద్రలో ఉండడంతో జిల్లా వ్యాప్తంగా అంబులెన్స్‌ సేవలలో ఉన్న వాహనాలు రాత్రి.. పగలు తేడా లేకుండా రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. రోగుల నుంచి ఇష్టానుసారం వసూళ్లు చేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు పాతిక వరకు ప్రైవేటు అంబులెన్సులు ఉన్నాయి. జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కోడంగల్‌ ప్రాంతాలలో ఈ అంబులెన్సులు సేవలు అందిస్తున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి రోగులను హైదరాబాద్‌కు తరలిస్తున్నాయి. అత్యవసరం ఉన్న రోగులను స్థానిక ప్రభుత్వ.. ప్రైవేటు ఆసుపత్రుల నుంచి హైదరాబాద్‌కు తరలిస్తారు. నిన్న మొన్నటి వరకు జిల్లాలోని తాండూరు నుంచి హైదరాబాద్‌కు రూ.3 వేలు, వికారాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు రూ.2,500, పరిగి నుంచి హైదరాబాద్‌కు రూ.2,500, కోడంగల్‌ నుంచి హైదరాబాద్‌కు రూ.3 వేలు ఛార్జిలను వసూలు చేశారు.

తాజాగా జిల్లా వ్యాప్తంగా కోవిడ్‌ రోగుల సంఖ్య భారీగా పెరిగింది. ప్ర తిరోజు నిత్యం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కోవిడ్‌ రోగులు హైదరాబాద్‌కు తరలివెళుతున్నారు. అత్యవసర చికిత్సలు అవసరం ఉన్న వారంతా హైదరాబాద్‌కు వెళుతున్నారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కోవిడ్‌ బాధితులను అంబులెన్స్‌లలో తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రాధాన్యం ఇస్తున్నారు. త్వరగా ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉండడంతో వాటిలోనే వెళుతున్నారు. అయితే కోవిడ్‌ బాధితులను హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌ వాహనాలను సమకూర్చే వ్యక్తులు ఇష్టారీతిన వసూలు చేస్తున్నారు. ఉదయం వేళ తరలించడానికి ఒక ధర..రాత్రి వేళ తరలించడానికి రెండింతల ధరలను వసూలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో ఏఆసుపత్రికి వెళుతున్నది ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్లిన తరువాత మరో ఆసుపత్రికి తీసుకవెళ్లాలంటే అదనంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కోవిడ్‌ బాధితులను హైదరాబాద్‌కు తరలించడానికి గరిష్ఠంగా రూ.6 వేలు వసూలు చేస్తున్నారు. ఎంత బేరాలు ఆడినా అంబులెన్స్‌ వాహనాల వారు కరగడం లేదు. తప్పని పరిస్థితులలో కోవిడ్‌ బాధితులు వాటిలోనే వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలో పరుగులు తీస్తున్న చాలా అంబులెన్స్‌ వాహనాలలో సరైన సౌకర్యాలు కూడా ఉండడం లేదు. చాలా వాటిలో ఆక్సిజన్‌ లేకపోయినా ఉన్నట్లు చెప్పి కోవిడ్‌ బాధితులను తరలిస్తున్నారు. ఇక స్థానిక ఆసుపత్రిలో కోవిడ్‌తో ఎవరైనా మృతి చెందితే.. లేదంటే హైదరాబాద్‌లోని ప్రైవేటు లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో మరణిస్తే అలాంటి వారి మృతదేహాలను స్వగ్రామాలకు తరలించడం బాధిత కుటుంబ సభ్యులకు తలకుమించిన భారంగా మారుతోంది. మృతదేహాల తరలింపుకు అంబులెన్స్‌ నిర్వాహకులు రెండింతల ఛార్జీని వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు మృతదేహంను తరలించడానికి రూ.10 వేలు డిమాండ్‌ చేస్తున్నారు. స్థానిక ఆసుపత్రుల నుంచి స్వగ్రామాలకు మృతదేహాలను తరలించడానికి రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. కోవిడ్‌తో బాధితులు సగం చనిపోతే..ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వాహకులు పూర్తిగా చంపేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు పోలీసు శాఖ..ఇటు రవాణా శాఖ అధికారులు ఎవరు కూడా తమను ఆపేవారు లేరనే ధైర్యంతో ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వాహకులు ఇష్టానుసారంగా వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement