Thursday, May 16, 2024

బట్టాపూర్ అక్రమ క్వారీలో ఈటీఎస్ సర్వే చేపట్టాలి : బీజేపీ నేత మల్లికార్జున్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, మే (ప్రభ న్యూస్) : ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలో గత ఏడేళ్లుగా పర్యావరణ అనుమతులు లేకుండా నడుస్తున్న క్వారీలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై విచారణ జరిపి వెంటనే ఈటీఎస్ (ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్) సర్వే నిర్వహించి నిజాలు నిగ్గుతేల్చాలని బాల్కొండ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ నాయకులు మల్లికార్జున్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కోరారు. శుక్రవారం నిజాంబాద్ నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి బట్టాపూర్ అక్రమ క్వారీలో ఈటీఎస్ సర్వే చేపట్టాలనీ కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ క్వారీ లీజుకు తీసుకున్న జియో స్టోన్ ఇండస్ట్రీస్ 10,000 క్యూబిక్ మీటర్లకు అనుమతులు తీసుకొని ఇప్పటికీ 12 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా తరలించారని, ఇందుకు పర్యావరణ అనుమతులు సైతం లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. నవంబర్ 2021 వరకు క్రషర్ నడుపుటకు అనుమతులు కూడా లేవని, ఈ క్వారీ స్కాంలో రాజకీయ నాయకుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు.

క్వారీ నుండి క్రషర్ కి, క్రషర్ నుండి బహిరంగ మార్కెట్ కి పెద్ద ఎత్తున సరుకు నడప డానికి రిజర్వ్ ఫారెస్ట్ లో బండ్లబాట ద్వారా నడపాల్సి ఉండగా నిబంధనలు బేఖాతరు చేస్తూ కంకర రోడ్డు వేసినారని పేర్కొన్నారు. సామాన్య ప్రజలు ఒక నెల కరెంట్ బిల్లులు కట్టకుండా ఉంటే అధికారులు కనెక్షన్ తీసేస్తున్నారని, క్వారీ మీద 50 లక్షల వరకు కరెంట్ బిల్లులు కట్టకుండా పెండింగ్లో ఉంటే అధికారులు ఏం చేస్తున్నారనీ ప్రశ్నించారు. ఆరు నెలల క్రితం తాను ఇచ్చిన ఫిర్యాదు అనంతరం 50 లక్షల రూపాయలు కరెంట్ బిల్లులు కట్టడం జరిగిందన్నారు. అనుమతులు తీసుకున్న పదివేల క్యూబిక్ మీటర్లకు బదులుగా, సుమారు 12 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా కంకర తరలించినట్లు పక్కా సమాచారం మాకుందని తెలిపారు. దీనిమీద ఆరు నెలల క్రితం హైదరాబాద్ లోని గనుల శాఖ డైరెక్టర్ కి ఫిర్యాదు చేశామని, ఈటీఎస్ సర్వే నిర్వహించాలని అసిస్టెంట్ డైరెక్టర్ నిజామాబాద్ కి ఆదేశాలు ఇస్తే, సర్వే చేయుటకు డబ్బులు జమ చేయాలని సంబంధిత లీజు సంస్థకి అధికారులు లేఖల ద్వారా తెలిపినా, తమ బాగో తం బయటపడుతుందని ఇప్పటికీ జమ చేయలేద న్నారు. సర్వే చేస్తే అసలు విషయాలు బయటపడ తాయని సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం కనీసం 200 కోట్లకు పైగా జరిమానా పడే అవకాశం ఉందని, దీనిలో నుండి సింహభాగం జిల్లాకి అందుతుందని దీనివల్ల ఈ ప్రాంతం కాస్తయినా బాగుపడే అవకాశం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఇకనైనా సర్వే నిర్వహించి వాస్తవ విషయాలను వెలికి తీయాలని, లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామ న్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు నారాయణరెడ్డి, మహిపాల్, సంజీవ్ మరియు పెద్ద ఎత్తున బట్టాపూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement