Monday, May 27, 2024

టార్గెట్‌ మోడీ, రేపు జమ్మూకు ప్రధాని.. భద్రతా దళాల వరుస ఎన్‌కౌంటర్‌

జమ్మూలో మోడీ పర్యటనకు ముందు వరుస ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయి. ఆదివారం లోయను సందర్శించేందుకు మోడీ సిద్ధం అవుతున్న వేళ ఈ దాడులు జరగడం కలకలం రేపుతున్నది. మోడీని లక్ష్యంగా చేసుకుని భారీ ఉగ్రదాడికి ముష్కరులు పథక రచన చేసినట్టు తెలుస్తున్నది. గత కొన్ని రోజులుగా జమ్మూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం జరిగిన రెండు ఎన్‌కౌంటర్స్‌లో ఆరుగురు ఉగ్రవాదులు చనిపోగా.. ఓ సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ వీర మరణం పొందాడు. జమ్మూలోని సుంజాన్‌ కంటోన్మెంట్‌ ఏరియాలో జరిగిన దాడిలో ఒక సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ ప్రాణాలు కోల్పోయాడు. మోడీ పర్యటనను లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు భారీ ఉగ్రదాడికి పథక రచన చేసినట్టు సమాచారం అందడంతో.. సుంజాన్‌ కంటోన్మెంట్‌ ఏరియాలో భద్రతా దళాలు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. భద్రతా దళాల రాకను గ్రహించిన ముష్కరులు వారిపై కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తుపాకులకు పని చెప్పారు. సీఐఎస్‌ఎఫ్‌ బస్సును లక్ష్యంగా చేసుకుని గ్రనేట్‌ లాంఛర్‌తో విరుచుకుపడ్డారు. పులామా తరహాలో దాడి చేయాలని భావించారు. కానీ భద్రతా దళాలు దాడిని తిప్పికొట్టడంతో.. ఇద్దరు ముష్కరులు హతం అయ్యారు. ఒక సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అమరుడయ్యాడు. ఐదుగురు గాయపడ్డారు. దాడి సమయంలో బస్సులో 15 మంది సిబ్బంది ఉన్నారు. జమ్మూ అంతటా.. హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇంటర్నెట్‌, మొబైల్‌ సేవలు నిలిపివేశారు. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు. డ్రోన్లను రంగంలోకి దింపారు. మోడీ పర్యటించే ప్రాంతాలను అణవణువూ జల్లెడ పడుతున్నారు. సుంజాన్‌లో జరిగిన దాడిలో మృతి చెందిన ఉగ్రవాదులను జైషే మహ్మద్‌కు చెందిన వారుగా గుర్తించారు.

బారాముల్లాలో ఎన్‌కౌంటర్‌
బారాముల్లాలోనూ శుక్రవారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. మృతుల్లో లష్కరే తోయిబా కమాండర్‌ యూసుఫ్‌ కంత్రూ ఉన్నట్టు తెలుస్తున్నది. బారాముల్లాలోని మాల్వా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో వారు ఆ ప్రాంతాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో.. ఉగ్రవాదులు వారిపై దాడికి దిగారు. దీంతో ప్రాణ రక్షణలో భాగంగా భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో నలుగురు ముష్కరులు హతం అయ్యారు. చనిపోయిన యూసుఫ్‌ కంత్రూ.. మోస్ట్‌ వాంటెడ్‌ టాప్‌-10 ఉగ్రవాదుల జాబితాలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు సైనికులు, ఓ అధికారికి స్వల్పంగా గాయాలయ్యాయి.

లష్కరే కీలక ఉగ్రవాది యూసుఫ్‌ హతం
యూసుఫ్‌ కంత్రూ.. స్థానికులు, రాజకీయ నేతలు, పోలీసులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డాడు. 2005లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌లో చేరాడు. అదే ఏడాది పోలీసులు అతన్ని పట్టుకునిజైల్లో పెట్టగా.. 2008లో బయటికి వచ్చాడు. 2017లో మమళ్లీ ఉగ్రవాదం వైపు అడుగులు వేసేందుకు లష్కరే తోయిబాలో చేరాడు. అప్పటి నుంచి పలు దాడుల్లో పాల్గొన్నాడు. చివరికి తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతం అయ్యాడు. 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. జమ్మూలోని సాంబా జిల్లా పల్లిd గ్రామం నుంచి మోడీ మాట్లాడనున్నారు. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు తరువాత తొలిసారి మోడీ జమ్మూలో పర్యటించనున్న నేపథ్యంలో కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు రంగంలోకి దిగాయి. మోడీ పర్యటించే ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement