Saturday, June 1, 2024

AP | అమ్మవారి ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు..

ఎన్టీఆర్ బ్యూరో, ప్రభ న్యూస్ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కనకదుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ఓ వైపు సార్వత్రిక ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో మరోవైపు వేసవి సెలవులు ముగుస్తున్న తరుణంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తున్నారు.

గత 3 రోజులుగా పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్న భక్తులు రాక కారణంగా ఆదివారం రికార్డు స్థాయిలో అమ్మవారి ఆలయ ఆదాయం పెరిగింది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు అమ్మవారిని 43,900 మంది దర్శించుకోగా క్యూలైన్లో దర్శనం కోసం ఇంకా భక్తులు వేచి ఉన్నారు.

గత మూడు రోజులుగా సుమారుగా లక్షన్నర మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ భారీగా పెరగడంతో అమ్మవారి ఆలయానికి కూడా అదే రీతిలో ఆదాయం పెరిగింది. దర్శన టిక్కెట్లు, కేశఖండన లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగింది.

వివిధ టిక్కెట్ల ద్వారా రికార్డు స్థాయిలో రూ.46,15,935 మొత్తం ఆదాయం సమకూరింది. శనివారం నాడు 40,100 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా వివిధ రూపాల్లో రూ.32,43,009 ఆదాయం సమకూరినట్లు అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఆలయంలో మొత్తం భక్తుల సంఖ్య 46,500 కాగా, మొత్తం ఆదాయం రూ.42,50,735గా ఉంది.

రోజురోజుకు అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ డిప్యూటీ కలెక్టర్, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ముందస్తు ప్రణాళికలో భాగంగా పకడ్బందీ చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement