Saturday, June 1, 2024

TG | మేడిగడ్డ పనులు షురూ..

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: సాగునీటి రంగంలో ప్రయోగశాలగా మారిన మేడిగడ్డ మరమ్మతుల ప్రక్రియలో మరోకొత్త కోణం ఆవిష్కరణ కానుంది. సమస్యాత్మక 7వ బ్లాక్‌ పునాదులకు అదనపు శక్తిని అందించేందుకు పునాదుల్లో ఉక్కు ఫలకలను దించేందుకు నీటిపారుదల శాఖ నిర్ణయించింది.

ప్రపంచంలోని పలు ఇంజనీరింగ్‌ సంస్థలతో సంప్రదింపులు జరిపిన ఇరిగేషన్‌ డిపార్టు మెంట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రెండు ఇంచుల మందంతో తొమ్మిది మీటర్ల లోతులోకి 7వబ్లాక్‌ చుట్టు పునాదుల్లోకి ఉక్కు ఫలకలను దించితే పునాది పటిష్టంగా ఉండటంతో పాటుగా నీటి ఊటల నియంత్రణ జరగనున్నట్లు నీటిపారుదల శాఖ నిర్ణయించింది. మరో రెండురోజుల్లో ఉక్కుఫలకల పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం.

మేడిగడ్డ బ్యారేజీ 7వబ్లాక్‌ పునరుద్ధరణ ప్రభుత్వానికి సవాల్‌గా నిలిచింది. ఒక అడుగు ముందుకు వేస్తే వంద అడుగులు వెనక్కు వేయాల్సి వస్తుంది. నేషనల్‌ డ్యాంసేఫ్టీఅథారిటీ మధ్యంతర నివేదికను అనుసరించి కుంగిన 7వబ్లాక్‌ పనులుకొనసాగుతుంటే ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ పనుల్లో శాస్త్రీయతను జోడించి ముందుకు వెళ్లుతోంది.

జూన్‌ మొదటి వారంలోగా 7వబ్లాక్‌ కింగిన 18,19,20వ పియర్ల మరమ్మతులు పూర్తి కాకుంటే ఇక ఈ బ్లాక్‌ గోదారమ్మ ఒడిలోకి చేరే ప్రమాదం ఉండటంతో సాధ్యమైనంతవరకు పనుల్లో వేగం పెంచారు. పూణే సెంట్రల్‌ వాటర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ శాస్త్రవేత్తల సూచనలు, నేషనల్‌ డ్యాంసేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదిక ఆధారంగా పనులు సాగుతున్నప్పటికీ ఊహించని సంఘటనలు చోటు చేసుకోవడంతో ఇంజనీర్లు మేదస్సుకు పదునుపెడుతూ పనుల్లో వేగం పెంచుతున్నారు.

నిషిద్ధ ప్రాంతంగా మేడిగడ్డ

- Advertisement -

7వబ్లాక్‌ 20 పియర్‌ దగ్గర బారీ గొయి ఏర్పడటంతో మరమ్మతులకోసం అనేక జాగ్రతలను నీటిపారుదల శాఖ తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో పరిశోధనలు పూర్తి అయ్యేంతవరకు ఇతరులను, సందర్శకులను, రాజకీయ నాయకులతో పాటు ప్రజలందరినీ మేడిగడ్డ బ్యారేజీ పరిసరాల్లో ప్రభుత్వం నిషేధించింది. గోయిలోపలికి ప్రత్యేక పద్దతిలో విద్యుత్‌ తరంగాలను పంపించడంతో పాటు శబ్దాలను ఎప్పటికప్పుడు రికార్డు చేసే సెన్సార్లను ఆదివారం గోయిలోలి పంపించారు.

ఈ సెన్సార్లు శబ్దతరంగాలను రికార్డుచేసిభూమిపొరల పటిష్టత,నాణ్యత, భవిష్యత్‌ ప్రమాదాలను అంచనావేయనుంది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజీలో గోదావరి నది ప్రవాహ సవ్వళ్లు మినహా ఇతర శబ్దాలు వినిపించకుండా జాగ్రతలు తీసుకుంటున్నారు. మేడిగడ్డ బ్యారేజీ తెలంగాణ వైపు పోలీసు ఔట్‌ పోలీసు స్టేషన్‌ ఏర్పాటుచేసి డ్రోన్ల పర్యవేక్షణలో ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారు.

బుధవారంలోగా పరీక్షలు అన్నీ పూర్తిచేసి గోయి ఏర్పడిన ప్రాంతంలో పవర్‌ ప్రెషర్‌ గ్రౌటింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇసుక,కంకర,నీరు ఒకప్రత్యేక పద్దతి ద్వారా సమస్యలు ఉత్పన్నమైన భూగర్భంలోనికి పంపించే ప్రక్రియ పవర్‌ ప్రెషర్‌ గ్రౌటింగ్‌ పద్దతి, బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన బ్యారేజీలకు ఈ విధానం వాటినట్లు తెలుస్తోంది.

పునాదుల్లో ఉక్కుఫలక అమరిక సమస్యాత్మకమైన 7వ బ్లాక్‌ పునాదుల్లో నీటిఊటలను అరికట్టేందుకు, పునాదులకు అదనపు శక్తిని కల్పించేందుకు బ్యారేజీ గేట్లచుట్టు తొమ్మిదిమీటర్ల లోతు నుంచి పైవరకు ఇనుప ఫలకలను దించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ పనులు ప్రారంభం కానున్నాయి.పునాదులకు ఈ ఉక్కు ఫలకలు మరింత శక్తిని ఇవ్వడంతో పాటుగా భవిష్యత్‌లో గోయిలు ఏర్పడే ప్రమాదం ఉండదని నీటిపారుదల నిపుణులుచెప్పారు.

పరిశోధనల ఖర్చు ప్రభుత్వానిదే

కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగాలైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమస్యలపై పరిశోధనలకు అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరించింది.నేషనల్‌ డ్యాంసేఫ్టీ అథారిటీ, పూణ శాస్త్ర వేత్తల పరిశోధన, అవసరమైన డిజైన్లు తదితర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.

అయితే మరమ్మతులకు అయ్యే ఖర్చు పూర్తిగా నిర్మాణ సంస్థలు ఎల్‌ అండ్‌ టీ, పీఈఎస్‌, నవయుగ భరించాల్సి ఉంటుందని మరోసారి నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ ముగిసిందని ఎల్‌ అండ్‌ టీ చేస్తున్న వాదనలపై న్యాయవిచారణ కమిటీ ఇచ్చే తీర్పుపైనే స్పందించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మేడిగడ్డ మరమ్మతుల పనులు ఎల్‌ అండ్‌ టీ నిర్మాణ సంస్థ చేయిస్తోందని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement