Monday, June 17, 2024

Malaysian Masters | ఫైనల్లో పోరాడి ఓడిన సింధు..

మలేషియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ పీవీ సింధు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ దిశగా అడుగులు వేసిన భారత స్టార్‌ షట్లర్‌ తెలుగు తేజం పీవీ సింధుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ సింధు 21-16, 5-21, 16-21 తేడాతో చైనాకు చెందిన రెండో సీడ్‌ వాంగ్‌ జీ యి చేతిలో ఓటమి పాలైంది.

దూకుడుగా మ్యాచ్‌ను ఆరంభించిన సింధు చైనా స్టార్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ తొలి గేమ్‌ను సులభంగా గెలుచుకుంది. తర్వాత పుంజుకున్న వాంగ్‌.. సింధుపై ఎదురుదాడికి దిగి ఏకపక్షంగా రెండో గేమ్‌ను దక్కించుకుంది. దాంతో ఇద్దరూ చెరోక గేమ్‌ గెలిచి సమానంగా నిలిచారు.

ఇక విజేతను తేల్చే ఆఖరి గేమ్‌లో మాత్రం భారత్‌-చైనా షట్లర్లు అమీతుమీగా తలపడ్డారు. చెరోపాయింట్‌ సాధిస్తూ పోవడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ నెలకొంది. కానీ చివర్లో వేగాన్ని పెంచిన చైనా క్రీడాకారిణి ఈ గేమ్‌లో సింధును ఓడించి మాలేషియా మాస్టర్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. దాదాపు 79 నిమిషాల పాటు సాగిన ఈ ఫైనల్‌ ఫైట్‌లో భారత స్టార్‌కు నిరాశే మిగిలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement