Saturday, April 27, 2024

ఢిల్లీకి జగన్.. అమిత్ షా అపాయింట్‌మెంట్ ఫిక్స్?

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. గురువారం సీఎం ఢిల్లీకి వెళ్లానున్నారు. పలువురు కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ కోసం సీఎం ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలోనే మకాం వేసిన వైసీపీ ఎంపీలు రక్షణ, ఆర్థికశాఖ మంత్రుల అపాయింట్‌మెంట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారైనట్లు సమాచారం.

పోలవరం ప్రాజెక్టు, రావాల్సిన నిధులు సకాలంలో విడుదల చేయాలని కేంద్ర పెద్దలను కోరనున్నారు. అదేవిధంగా విభజన హామీలు, వాక్సినేషన్‌ తదితర అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఈ సారి సీఎం ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది. సీఎం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే అప్పాయింట్ మెంట్ తీసుకున్నట్లుగా సమాచారం. అమిత్ షాతో జరిగే సమావేశంలో ప్రధానంగా ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితులపైన చర్చించనున్నారు.

మరోవైపు ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో కేంద్రం నుండి వ్యాక్సిన్ల పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఇప్పటికే ప్రధానికి లేఖలు రాసారు. అంతేకాదు వ్యాక్సిన్ల అంశంపై జగన్ అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసారు.  ఏపీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఆయన ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పలువురు ఎంపీలు, అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లకు తనపై  థర్డ్ డిగ్రీ జరిగిందంటూ రఘురామ ఇప్పటికే లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కేంద్రమంత్రులను కలిసి ఏపీ ప్రభుత్వ వైఖరిని వివరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ హస్తిన పర్యటన ఆసక్తి రేపుతోంది. కాగా సోమవారం ఢిల్లీ పర్యటన ఉన్నప్పటికీ  చివరి నిముషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement