Friday, April 26, 2024

Update: చెడిపోయిన బోటులో ఏకె 47 తుపాకులు.. మహారాష్ట్రలో తీవ్ర కలకలం

మహారాష్ట్రలో తుపాకుల బోటు తీవ్ర కలకలం రేపింది. ముంబైకు సుమారు 190కిమీల దూరంలోని రాయ్‌ఘడ్‌లోని హరిహరేశ్వర్‌ బీచ్‌లో నిలిచిఉన్న చెడిపోయిన బోటులో మూడు ఏకె 47 తుపాకులు, బుల్లెట్లు, డాక్యుమెంట్లను గురువారం మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక మత్స్యకారులు బీచ్‌ వద్దకు కొట్టుకొచ్చిన పడవను, అందులో ఉన్న తుపాకులను గుర్తించి నేవీ దళానికి, పోలీసులకు సమాచారం అందించారు. హరిహరేశ్వర్‌ బీచ్‌లో ఏకె 47 బోటుపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ఒక ప్రకటన చేశారు. బీచ్‌లో లభ్యమైన ఆ బోటులో మూడు ఏకె 47 తుపాకులు, బుల్లెట్లు, డాక్యుమెంట్లు ఉన్నాయని డిప్యూటీ సీఎం ఫడ్నవిస్‌ ప్రకటించారు. ఆ బోటులో ఆస్ట్రేలియాకు చెందిన భార్యభర్తలు ప్రయాణించారని, ఇంజిన్‌లో సమస్యలు తలెత్తడంతో వదిలి పెట్టి వెళ్లారని డిప్యూటీ సీఎం ఫడ్నవిస్‌ ప్రకటించారు. ఆ బోటు పేరు లేడీ హన్‌ అని, ఆ బోటు యజమాని ఆస్ట్రేలియాకు చెందిన హన లౌండర్‌గన్‌ కాగా, కెప్టెన్‌ జేమ్స్‌ హర్బెర్ట్‌ ఆమె భర్త అని ఫడ్నవిస్‌ ప్రకటించారు.

హరిహరేశ్వర్‌ బీచ్‌ వద్దకు ఎవరూ బోటును తీసుకు రాలేదని, అదే హరిహరేశ్వర్‌ తీరానికి చేరుకుందని డిప్యూటీ సీఎం ఫడ్నవిస్‌ అన్నారు. ఈ ఏకె 47 తుపాకుల విషయంలో ఎలాంటి ఉగ్రవాద కోణం లేదని ఆయన స్పష్టం చేశారు. కానీ, దీనిపై విచారణ సాగుతోందని, ఏ కోణాన్నీ కొట్టి పారేయలేమని, ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని తాను వెల్లడించింది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే అని ఆయన అన్నారు. ప్రస్తుతం స్థానిక పోలీసులు మరియు తీవ్రవాద వ్యతిరేక దళాలు ఏకె 47 తుపాకులపై దర్యాప్తు చేస్తున్నాయని ఆయన ప్రకటించారు. హరిహరేశ్వర్‌ బీచ్‌ వద్ద భద్రత పెంచారు. తీరప్రాంత నౌకాదళం, ఇతర ఏజెన్సీలు గస్తీ చేపట్టాయి. బోటులో తుపాకులపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాల్సిందిగా రాయ్‌గఢ్‌ ఎమ్మెల్యే అదితి తాత్కేర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండేకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement