Thursday, May 16, 2024

ఎఫ్‌డీఐలకు ప్రత్యేక పారిశ్రామిక పార్కులు.. ఒకే పార్కులో కంపెనీలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారులు(ఎఫ్‌డీఐ)లకు ప్రభుత్వం ఎర్రతివాచీ పరుస్తోంది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వివిధ దేశాల వారికి ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తూ ప్రోత్సహిస్తోంది. ఈ ప్రత్యేక పారిశ్రామిక పార్కుల్లో వారికి కావల్సిన మౌలిక సదుపాయాలన్నింటిని కల్పిస్తోంది. దీంతో ఒక దేశం తర్వాత మరో దేశం నుంచి ఎఫ్‌డీఐలు తెలంగాణకు క్యూ కడుతున్నాయి. ఫలితంగా 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి దేశంలోఏ అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కింది. ఎనిమిదేళ్లలో సుమారు 4 బిలియన్‌ డాలర్లు(రూ.32వేల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించగలిగింది. భవిష్యత్తులో ఈ ఒరవడిని కొనసాగించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది.

ఇందులో భాగంగా తాజాగా రాష్ట్రానికి వచ్చిన తైవాన్‌ పారిశ్రామికవేత్తల బృందానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పెట్టుబడులపై భరోసా కల్పించారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రత్యేక పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయడంతో పాటు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీనికి స్పందించిన తైవాన్‌ పారిశ్రామికవేత్తల బృందం తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విషయమై తమకున్న సందేహాలన్నింటిని మంత్రి కేటీఆర్‌ నివృత్తి చేశారని, ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలోత్వరలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్‌ పారిశ్రామికవేత్తలు వస్తారని తెలిపింది.

- Advertisement -

పలు పార్కుల నిర్మాణానికి రంగం సిద్ధం…

తెలంగాణలోకి పెట్టుబడులను ఆకర్షించడం కోసం బ్రిటన్‌, ప్యారిస్‌ తదితర దేశాల్లో రోడ్‌షోలకు వెళ్లినపుడు, ఇతర దేశాల పారిశ్రామికవేత్తల బృందాలు ఇక్కడికి పర్యటనకు వచ్చినపుడు వారితో జరిగిన భేటీల్లో పరిశ్రమల శాఖ అధికారులు ఆ దేశాల పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలో ప్రత్యేక పార్కుల హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా ఇప్పటికే కొన్ని దేశాల పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కులను నిర్మించేందుకుగాను పరిశ్రమల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు శాఖ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో ఈ పార్కుల నిర్మాణం ప్రారంభమవుతుందని పేర్కొంటున్నాయి. రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధికి, దేశానికి విదేశీ మారకద్రవ్యం లభించడానికి ఎఫ్‌డీఐల పెట్టుబడులు అత్యంత కీలకమైనవని, వీటిని ఆకర్షించడానికి ఎలాంటి చర్యలు అవసరమైతే అవన్నీ తీసుకుంటామని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ప్రపంచవ్యాప్తంగా మంచి బ్రాండ్‌ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మరిన్ని ఎఫ్‌డీఐలను ఆకర్షించి ఆ పేరును సుస్థిరం చేసుకోవాలనేదే తమ ప్రయత్నమని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement