Tuesday, October 8, 2024

Rishabh Pant : కీప‌ర్ బ్యాట‌ర్ గా పంత్ కే ఛాన్స్..

మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మహా సమరానికి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ సారి విశ్వవిజేతగా నిలవడం కోసం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఇక వన్డే వరల్డ్ కప్‌ను తృటిలో చేజార్చుకున్న టీమిండియా ఈ సారి పొట్టి కప్‌ను ఎట్టిపరిస్థితుల్లో మిస్ కావొద్దని కసిగా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

ఈ మెగా టోర్నీ కోసం రోహిత్ శర్మ సారథ్యంలో 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. వికెట్ కీపర్ స్థానం కోసం కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్ నుంచి తీవ్ర పోటీ ఎదురైనప్పటికీ అంతిమంగా రిషభ్ పంత్, సంజు శాంసన్ జట్టులో చోటు సంపాదించారు. రోడ్డు ప్రమాదానికి గురై 15 నెలల పాటు ఆటకు దూరమైన పంత్ ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే టీ20 వరల్డ్ కప్ భారత తుది జట్టులో పంత్, శాంసన్‌లలో ఎవరు చోటు దక్కించుకుంటారనే చర్చ మొదలైంది. దీనిపై స్పందించిన గౌతమ్ గంభీర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. శాంసన్‌కు నిరాశే మిగులుతుందని, పంత్ తుది జట్టులో చోటు సంపాదించుకుంటాడని చెప్పాడు. శాంసన్‌కు బదులుగా పంత్‌వైపే టీమిండియా మేనేజ్మెంట్ ఎందుకు మొగ్గుచూపుతుందో గంభీర్ వివరించాడు.

”పంత్, శాంసన్ ఇద్దరూ ఎంతో నాణ్యమైన క్రికెటర్లు. ఇద్దరికీ అద్భుతమైన నైపుణ్యం సొంతం. అయితే వారిద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే, నేను పంత్‌ను సెలక్ట్ చేస్తా. ఎందుకంటే పంత్ సహజంగా మిడిలార్డర్ బ్యాటర్. మరోవైపు శాంసన్ టాప్ ఆర్డర్ బ్యాటర్. ఐపీఎల్‌లో శాంసన్ మూడో స్థానంలో ఆడుతున్నాడు. కానీ పంత్ మాత్రం అయిదు, ఆరు, అవసరమైతే ఏడో స్థానంలోనూ బ్యాటింగ్‌కు వస్తున్నాడు”

”అంతేగాక టీమిండియా కాంబినేషన్‌లో వికెట్ కీపర్‌ను టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా ఉపయోగించరు. మిడిలార్డర్ బ్యాటర్‌గా వాడుకోవాలని చూస్తారు. అందుకే పంత్‌ను ఎంపిక చేశా. అలాగే పంత్ ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం వల్ల మిడిలార్డర్‌లో లెఫ్ట్-రైట్ హ్యాండ్ కాంబినేషన్ ఉంటుంది” అని గంభీర్ అన్నాడు. కాగా, ఐపీఎల్-2024లో శాంసన్ 504, పంత్ 446 పరుగులు సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement