Wednesday, May 22, 2024

పుట్టుక నుంచి చావు దాకా జీఎస్టీ.. ఇక మిగిలింది అంతిమయాత్రే: ఎంపీ సురేష్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అమృత్ కాల్ అని చెప్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతోందని టీఆర్‌ఎస్ ఎంపీ కె.ఆర్.సురేష్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ… పుట్టుక నుంచి చావు దాకా జీఎస్టీ వేయాల్సిందని ఎద్దేవా చేశారు. ఇక మిగిలింది అంతిమ యాత్రే, దానిపై కూడా పన్నులు వేయాలని మండిపడ్డారు. పెట్రో ఉత్పత్తులపై వ్యవసాయ సెస్ పేరిట కేంద్రం లీటర్ పై 2.50 పైసలు వసూలు చేస్తోందన్న సురేష్ రెడ్డి, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఈ సెస్‌ను వినియోగిస్తామని చెబుతున్న కేంద్రం దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సెస్‌ను ఏడేళ్లలో ఎంతమేర వ్యవసాయ రంగ అభివృద్ధికి వాడారో చెప్పాలని నిలదీశారు.

ఏడేళ్లలో ఒక్క మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించలేదు, రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వలేదని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ద్రవ్యోల్బణ ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోందని చెప్పుకొచ్చారు. 2014 ముందు దేశంలో అత్యంత వెనకబడిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు దేశాభివృద్ధికి ఆర్థికంగా చేయూతనిస్తున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. గడిచిన ఏడేళ్లలో ఇది తమ ఘనత అని సురేష్ రెడ్డి చెప్పుకొచ్చారు. నదీ జలాలను వీలైనంత ఎక్కువగా వాడుకునేలా తాము ప్రణాళికలు రూపొందించుకున్నామని వివరించారు.

సమాక్య స్ఫూర్తికి విరుద్దంగా కేంద్రం వ్యవహరిస్తోందని, రాష్ట్రం తీసుకుంటున్న అప్పులు, ఇతర అంశాలపై పరిమితులు విధిస్తోందని సురేష్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం తీరుతో రాష్ట్రానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, తెలంగాణ పురోగతి, ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్న రాష్ట్రాలకు కేంద్రం సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా వల్ల ధరలు పెరగలేదన్న ఆయన, నోట్ల రద్దు తర్వాతే ధరల పెరుగుదల స్పష్టంగా కన్పిస్తోందని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement