Tuesday, July 23, 2024

TS | కవిత చార్జిషీటుపై ఆర్డర్‌ రిజర్వు.. మే 29న తీర్పు

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ: ఢిల్లి మద్యం పాలసీ అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన 7వ సప్లిమెంటరీ చార్జిషీటును పరిగణలోకి తీసుకునే అంశంపై మంగళవారం రౌజ్‌ అవెన్యూ కోర్టు విచారణ పూర్తి చేసింది. తీర్పును రిజర్వు చేస్తూ మే 29న వెలువరించనున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. ఈ చార్జిషీటులో కవితతో పాటు మరో నలుగురిని నిందితులుగా పేర్కొంటూ అభియోగాలు నమోదు చేసిన విషయం తెలిసిందే.

8వేల పేజీలకు పైగా ఉన్న ఈ చార్జిషీటులో నిందితులకు వ్యతిరేకంగా సేకరించిన సాక్ష్యాధారాలు చాలా ఉన్నాయని పేర్కొంది. చార్జిషీటుపై విచారణ సందర్భంగా మనీలాండరింగ్‌ జరిగిన విధానాన్ని ఈడీ వివరించింది. మొత్తంగా రూ. 100 కోట్లు అక్రమ మార్గాల్లో చేతులు మారాయని వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో వరుసగా రెండ్రోజుల పాటు ఈ చార్జిషీటును పరిగణలోకి తీసుకునే అంశంపైనే విచారణ జరిగింది.

మరోవైపు ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు ఆమ్‌ ఆద్మీ పార్టీని సైతం నిందితుల జాబితాలో చేర్చుతూ 8వ సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలైంది. దానిపై మే 28న విచారణ చేపట్టనున్న రౌజ్‌ అవెన్యూ కోర్టు కాంప్లెక్సులోని సీబీఐ కోర్టు స్పెషల్‌ జడ్జి కావేరి బవేజా తెలిపారు. రెండు చార్జిషీట్లను పరిగణలోకి తీసుకునే అంశంపై మే 29న తీర్పు వెలువరించే అవకాశం ఉంది. తద్వారా కేసులో దర్యాప్తును ముగించి ట్రయల్‌ ప్రారంభించేందుకు దర్యాప్తు సంస్థ కూడా సిద్ధమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement