Friday, April 26, 2024

త్వరలో సమగ్ర క్రీడా పాలసీ.. రేప‌టి నుంచి మే 31 దాకా విద్యార్థులకు వేసవి క్రీడా శిక్షణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సమగ్ర క్రీడా పాలసీని త్వరలో ప్రకటిస్తామని క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పారు. విద్యార్థినీ, విద్యార్థులు క్రీడల పట్ల ఆకర్షితులయ్యే విధంగా శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుతామని అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (సాట్స్‌) ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల వాల్‌పోస్టర్‌ను మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆవిష్కరించారు. అలాగే క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు అవసరమైన నిధులను సాట్స్‌కు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. సాట్స్‌ ఆధ్వర్యంలో ఈనెల 16 నుంచి మే 31 వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అన్ని క్రీడా స్టేడియాలలోనూ, మే 1 నుంచి 31వ తేదీ వరకు మిగిలిన అన్ని జిల్లాల్లో వేసవి శిక్షణ శిబిరాలలో వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారన్నారు.

సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడా మైదానాలతో పాటు హైదరాబాద్‌ సాట్స్‌ పరిధిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం, కేవీబీఆర్‌ ఇండోర్‌ స్టేడియం (యూసుఫ్‌గూడ), సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్స్‌, సరూర్‌ నగర్‌ స్టేడియం సైకింగ్‌ వెల్‌డోమ్‌, ఎల్బీ స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఉంటాయన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్ళ నుంచి వాయిదా పడిన ఈ వేసవి శిక్షణా శిబిరాలను ఈసారి అన్ని స్టేడియాలలో ఏర్పాటు చేశామన్నారు. చదువుల ఒత్తిడి నుంచి బయటపడటానికి విద్యార్థులకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లల్ని క్రీడల్లో ప్రోత్సహించాలని ఆయన కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement