Tuesday, May 7, 2024

డ్రంకెన్‌ డ్రైవ్‌ తరహాలో డ్రగ్స్‌ టెస్టులు.. రెడీ అవుతున్న తెలంగాణ‌ పోలీసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో డ్రగ్స్‌ రవాణా, వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు పోలీసు శాఖ సన్నద్దమవుతోంది. ఇప్పటికే యాంటీ నార్కోటిక్‌ సెల్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికారులు తాజాగా మరిన్ని చర్యలకు సిద్దమవుతున్నారు. డ్రగ్స్‌ వినియోగం ఐటీ ఉద్యోగులతో పాటు సంపన్నులు, సాధారణ ప్రజలు కూడా విచ్చలవిడిగా వినియోగిస్తున్నట్లు ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల ద్వారా వెల్లడైంది. డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు పోలీసులు కొత్త కొత్త విధానాలను అవలంభిస్తున్నారు. ఫళితంగా కొంత కాలంగా రాష్ట్రంలో డ్రగ్స్‌ కేసులో కుప్పలు తెప్పలుగా వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్‌ తీసుకుంటున్న వారిలో అన్ని రకాలు, వర్గాలు ఉన్నట్లు వెల్లడవుతుండటంతో డ్రగ్స్‌పై మరింత కఠినంగా వ్యవహరించడంతో పాటు మహమ్మారిని రాష్ట్రం నుంచి పారద్రోలేందుకు నడుం కట్టారు.

చిన్నా, పెద్ద అంటూ తేడా లేకుండా డ్రగ్స్‌ తీసుకుంటున్న వారు నగరంలో అన్ని చోట్ల ఉన్నారని. అన్ని చోట్ల అనుకున్న వెంటనే డ్రగ్స్‌ లభ్యమవుతుండటం పట్ల పోలీసులు కలవరం చెందుతున్నారు. డ్రగ్స్‌ తీసుకున్న అనంతరం పౌరులు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తుండటంతో కొన్ని సందర్భాలలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండటం, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతుండటంతో డ్రగ్స్‌ నుంచి ప్రజలను కాపాడేందుకు మరింత కఠినంగా వ్యవహరించాల్సిందన్న అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇందు కోసం డ్రగ్స్‌ విక్రేతలతో పాటు వినియోగదారులపై కేసులను నమోదు చేయడం, విస్తృతంగా అవగాహనా సదస్సులు, చైతన్య కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు డ్రంకన్‌ డ్రైవ్‌ టెస్టులనూ నిర్వహించాలని నిర్ణయించారు.

డ్రంకెన్‌ అండ్‌ టెస్టుల మాదిరిగా అప్పటికప్పుడు రిజల్ట్‌ వచ్చే మిషన్లను వాడుకలోకి తీసుకు రావాలని అధికారులు భావిస్తున్నారు. టెస్టులో భాగంగా అనుమానితుల నోట్లోని లాలాజలంతో టెస్టు చేస్తారు. రెండు నిమిషాల్లో రిజల్ట్‌ వస్తుందని పోలీసులు తెలిపారు. ఇప్పటికే కేరళ, గుజరాత్‌లో ఈ ప్రయోగం సక్సెస్‌ అయినట్టు పోలీసులు తెలిపారు. డ్రగ్‌ టెస్టుల నిర్వహణకు పోలీసుల కసరత్తు వేగవంతమైంది. డ్రగ్స్‌ వినియోగదారులను గుర్తించేందుకు డ్రగ్‌ అనలైజర్లు గంజాయి, హష్‌ ఆయిల్‌, కొకైన్‌, హెరాయిన్లను గుర్తించే డ్రగ్‌ ఆనలైజర్లు త్వరలోనే అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించారు. మిషన్‌ల వినియోగం, టెస్టుల ఫలితాలను పోలీసులు అధ్యయనం చేయనున్నారు. లా అండ్‌ ఆర్డర్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు డ్రగ్‌ పరీక్షలు చేయనున్నారు. పబ్‌లు, అనుమానిక పార్టీలు జరిగిన ప్రాంతాలతో పాటు అనుమానిత వ్యక్తులకు ఈ డ్రగ్‌ టెస్టులు చేస్తే అప్పటికప్పుడు ఎవరు డ్రగ్స్‌ తీసుకున్నారనేది తేలుతుందని, కోర్టుల్లో కేసులు వేసినా సాంకేతిక ఆధారాల ద్వారా శిక్షలు త్వరగా పడే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement