Monday, April 29, 2024

Big story : త్వరలో పార్లమెంటరీ బోర్డులోకి యోగి! జాతీయ స్థాయిలోనూ యోగికి పెరగనున్న బాధ్యతలు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్వితీయ విజయంతో పాటు తాజాగా విధాన పరిషద్ (శాసన మండలి) ఎన్నికల్లోనూ 36 సీట్లకు 33 గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేసిన యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సర్కారు దూకుడు మరింత పెంచుతోంది. సాహసోపేత చర్యలు, నిర్ణయాలకు ఎగువ సభలో బ్రేకులు వేస్తూ వచ్చిన ప్రతిపక్షాలతో మొదటి విడత ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్న యోగి, ఈసారి ఎగువ సభలోనూ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించి ఇకపై తాము తీసుకునే నిర్ణయాలకు ఎదురు లేకుండా చేసుకున్నారు. అచ్చంగా కేంద్రంలోని మోదీ సర్కారును అనుసరిస్తూ రెండో విడత ప్రభుత్వంలో మరింత దూకుడు నిర్ణయాలతో దూసుకెళ్లేందుకు యోగి సిద్ధపడుతున్నారు. కేంద్రంలో మోదీ సర్కారు సైతం రాజ్యసభలో తగినంతగా సంఖ్యాబలం లేకపోవడంతో ఎన్డీయే-1 (2014-2019)లో అనేక వివాదాస్పద సాహసోపేత బిల్లులను పాస్ చేసుకోలేకపోయింది. కానీ 2019లో రెండోసారి మరింత భారీ మెజారిటీతో ఎన్డీయే-2 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోదీ-షా ద్వయం, వచ్చీరావడంతోనే ఆర్టికల్ 370 రద్దు సహా పలు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. సుప్రీంకోర్టు ద్వారా రామజన్మభూమి భూవివాదానికి ఒక పరిష్కారం రాగా, మరుక్షణమే రామమందిర నిర్మాణానికి చకచకా నిర్ణయాలు తీసుకోవడమే కాదు, భూమిపూజ కూడా నిర్వహించారు.

కొన్ని దశాబ్దాల తర్వాత 2017లో తొలిసారి యూపీ అసెంబ్లీని కైవసం చేసుకున్న బీజేపీ, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి డబుల్ ఇంజిన్ సర్కారుగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దూసుకెళ్లింది. కోవిడ్-19 సెకండ్ వేవ్ సమయంలో అంతర్జాతీయస్థాయిలో విమర్శలు మూటగట్టుకున్నా సరే, వాటన్నింటినీ అధిగమించి తనను ఓడించడానికి ఏకమైన కూటములను సైతం ఢీకొట్టి యోగి రెండోసారి భారీ మోజారిటీతో గెలుపొందారు. అయితే కేంద్ర ప్రభుత్వం తరహాలోనే తొలి విడతలో యోగికి విధాన్ సభ (శాసన సభ)లో సంపూర్ణ మద్ధతున్నా, విధాన్ పరిషద్ (శాసన మండలి)లో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో అనేక కీలక బిల్లుల విషయంలో ప్రతిపక్షాలు అవాంతరాలు సృష్టిస్తూ వచ్చాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన రికార్డుస్థాయి మెజారిటీ మొత్తం సభలో పార్టీల బలాబలాలను పూర్తిగా తలకిందులు చేసింది.

ఒక్క ఎన్నికతో రెట్టింపైన సంఖ్యాబలం

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో యోగి ఆదిత్యనాథ్ ఏమాత్రం అలసత్వం వద్దంటూ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఎగువసభలో సాధించే సంఖ్యాబలంతోనే ప్రభుత్వ నిర్ణయాలకు ఆమోదముద్ర సాధ్యమవుతుందని వారందరికీ పదేపదే గుర్తు చేస్తూ వచ్చారు. మొత్తంగా 36 సీట్లకు జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 33 చోట్ల గెలుపొందింది. మిగతా మూడు చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీపార్టీ ఒక్క సీటులోనూ గెలవలేకపోయింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాశి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వారణాశి ఎమ్మెల్సీ స్థానంలో జైలుపాలైన మాఫియాడాన్ బ్రిజేశ్ సింగ్ భార్య అన్నపూర్ణ సింగ్ రెండోసారి గెలుపొందారు. అన్నపూర్ణ సింగ్ 4,234 ఓట్లు సాధించగా, ద్వితీయస్థానంలో నిలిచిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఉమేశ్ యాదవ్ 345 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. ఇక బీజేపీ అభ్యర్థి సుధామ పటేల్ కేవలం 170 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏదిఏమైనా, అప్పటి 100 సీట్ల ఉత్తరప్రదేశ్ విధాన్ పరిషద్ (శాసన మండలి)లో అప్పటి వరకు కేవలం 32 సీట్లకే పరిమితమైన బీజేపీ, తాజా ఎన్నికల ఫలితాల అనంతరం సంఖ్యాబలాన్ని ఒక్కసారిగా 65కు పెంచుకోగలిగింది. ప్రతిపక్షాల్లో సమాజ్‌వాదీకి 17, బీఎస్పీకి 4, కాంగ్రెస్, అప్నాదళ్ (సోనేలాల్), నిషాద్ పార్టీలకు ఒక్కొక్క ఎమ్మెల్సీ మిగిలారు. మిగతావాటిలో ఉపాధ్యాయుల కోటా ఎమ్మెల్సీలు, స్వతంత్రులున్నారు. బీజేపీ చరిత్రలోనే ఇంత భారీ సంఖ్యాబలం ఎన్నడూ లేదు. ఉత్తరాఖండ్ విడిపోకముందు ఆనాటి 108 సభ్యుల విధాన్ పరిషద్‌లో బీజేపీ గరిష్టంగా 54 సీట్ల మెజారిటీ మాత్రమే సాధించగల్గింది. కానీ ఇప్పుడు 100 సీట్ల పరిషద్‌లో 65 సీట్లతో మూడింటి రెండొంతుల బలం సాధించి గత రికార్డులను తిరగరాసింది.

తెరపైకి జనాభా నియంత్రణ బిల్లు

- Advertisement -

అప్పటివరకు ‘గూండారాజ్‌’గా పేరొందిన ఉత్తర్‌ప్రదేశ్‌లో వ్యవస్థీకృతమైన నేరసామ్రాజ్యాన్ని అదుపు చేయడం కోసం యోగి సర్కారు చట్టాన్ని మీరి ఎన్‌కౌంటర్లను ఆశ్రయించింది. చివరకు ఎన్‌కౌంటర్ రాజ్ అనే అపప్రదను మూటగట్టుకున్నా సరే, నేరాల అదుపులో చాలా పురోగతి సాధించగల్గింది. ఈ క్రమంలో వ్యవస్థీకృత నేరాలను అదుపుచేయడం కోసం ఉద్దేశించిన ఉత్తర్‌ప్రదేశ్ వ్యవస్థీకృత నేరాల నిరోధక బిల్లు (UPCOC – ఉత్తర్‌ప్రదేశ్ కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్)ను 2017లోనే యోగి సర్కారు ప్రవేశపెట్టినప్పటికీ, ఎగువ సభలో ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకున్నాయి. ఇప్పుడు మారిన సంఖ్యాబలం నేపథ్యంలో ఈ బిల్లును వెంటనే తెరపైకి తీసుకొచ్చి పాస్ చేసే అవకాశం కనిపిస్తోంది.

దీంతో పాటు యూపీ అభివృద్ధికి అవరోధంగా మారిన జనాభా విస్ఫోటనాన్ని ఆపేందుకు జనాభా నియంత్రణ బిల్లును తీసుకొచ్చేందుకు యోగి సిద్ధమయ్యారు. పాపులేషన్ పాలసీ 2021-30 పేరుతో జులై 2021లోనే యోగి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. 2026 నాటికి జననాల రేటును 2.7 శాతం నుంచి 2.1 శాతానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది సాధించడం కోసం కఠినంగా వ్యవహరించాలంటే కఠినమైన చట్టం కూడా అవసరమని, అందుకోసమే జనాభా నియంత్రణ బిల్లు తీసుకొస్తారని కమలనాథులు చెబుతున్నారు.

పార్లమెంటరీ బోర్డులోకి యోగి!

యూపీలో బీజేపీ మొదటిసారి గెలుపొందడానికి కారణాలు అనేకం ఉండొచ్చు. కానీ వరుసగా రెండోసారి గెలవాలంటే మాత్రం కచ్చితంగా నాయకుడి పనితీరు ప్రజల మెప్పు పొందాల్సి ఉంటుంది. ఉత్తర్‌ప్రదేశ్ విషయంలో అదే జరిగింది. కొన్ని దశాబ్దాల తర్వాత 2017లో ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంలో మోదీ హవా, సమాజ్‌వాదీ ‘గూండారాజ్’పై ప్రజల వ్యతిరేకత వంటి కారణాలెన్నో చెప్పవచ్చు. నిజానికి ఆ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది కూడా ప్రకటించలేదు. కానీ 2022లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికలు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఐదేళ్ల పనితీరుకు అగ్నిపరీక్షగా మారాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న సొంతపార్టీ ప్రభుత్వం కారణంగా భారీస్థాయిలో మౌలికవసతుల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు రాష్ట్రంలో ఉక్కుపాదంతో రౌడీయిజాన్ని అణచివేసి మహిళల భద్రతకు భరోసా కల్పించడంలో యోగి సఫలమయ్యారు. విమర్శలు, వివాదాల సంగతెలా ఉన్నా, రెండోసారి కూడా భారీ మెజారిటీతో గెలుపొందడంలో యోగి ఘనత కచ్చితంగా ఉంది. అందుకే ఆయనకు పార్టీ జాతీయస్థాయిలో తీసుకునే నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది. పార్టీ నిర్ణయాల్లో అత్యున్నత నిర్ణయాత్మక మండలి పార్లమెంటరీ బోర్డు. 11 మంది సభ్యుల ఈ బోర్డులో ప్రస్తుతం 4 ఖాళీలున్నాయి. అందులో ఒకటి యోగితో భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. తద్వారా జాతీయస్థాయిలో పార్టీ తీసుకునే నిర్ణయాల్లో యోగి భాగం పంచుకోవడం ఒకెత్తయితే, మోదీ-షా ద్వయం తమ రాజకీయ వారసుడిగా యోగి ఆదిత్యనాథ్‌ను మెల్లమెల్లగా ఢిల్లీ వైపు తీసుకొచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement