Friday, April 26, 2024

విశాఖకు రాజధాని తప్పకుండా వస్తుంది.. కానీ డేట్ అడగొద్దు: విజయసాయిరెడ్డి

ఏపీలో మూడు రాజధానుల అంశం కోర్టులో పరిధిలో ఉందని, పరిపాలన రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుందని, కానీ డేట్ అడగవద్దని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాజధాని తరలింపునకు, కోర్ట్ కేసుకు సంబంధం లేదన్నారు. సీఆర్డీఏ కేసుకు, రాజధాని తరలింపునకు కూడా సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడి నుంచైనా పాలన చేసే అధికారం సీఎంకు ఉందన్నారు.

అటు గ్రేటర్ విశాఖలో వార్డుల వారీగా అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ముదసర్లోవ పార్కును అంతర్జాతీయ పార్కుగా అభివృద్ధి చేస్తామన్నారు. రూ.100 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. కైలాసగిరి నుంచి ఎయిర్ పోర్ట్ నిర్మించే భోగాపురం వరకు సముద్ర తీరం వెంబడి ఆరు లైన్ల రోడ్లను నిర్మిస్తామన్నారు. సింహాచలం భూములకు రక్షణ కలిగించేలా ప్రహరీ గోడ నిర్మిస్తామని, పంచగ్రామాల సమస్య కోర్టులో ఉందన్నారు. తీర్పుకు అనుగుణంగానే నిర్ణయం అమలు చేస్తామన్నారు. జిల్లాలో అభివృద్ధి ప్రణాళికల అమలుకు కమిటీని నియమించామన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తామని తెలిపారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. మురికివాడల్లో అభివృద్ధికి ప్రణాళికలు, పట్టాలు త్వరలోనే అందిస్తామన్నారు. ప్రైవేట్ స్థలాలలో భూమిని ప్రభుత్వం సేకరించి పట్టాలు అందిస్తామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement