Friday, April 26, 2024

తెలంగాణలో ఈనెల 11 నుంచి వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రగతి భవన్‌లో బుధవారం సీఎం కేసీఆర్ డిజిటల్ సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలన్నారు.దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని, అందులో 3 గ్రామాలను గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎంపిక చేయాలని, మిగతా 24 గ్రామాలను రాష్ట్రంలోని ఇరవై నాలుగు జిల్లాలనుంచి ఎంపిక చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

భూ తగాదాలు లేని భవిష్య తెలంగాణను నిర్మించే లక్ష్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సర్వే చేయిస్తోందన్నారు సీఎం కేసీఆర్ . వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేసి, వాటికి అక్షాంశ రేఖాంశాలను ( కో ఆర్డినేట్స్) గుర్తించి తద్వారా పట్టాదారుల భూములకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. పైలట్ సర్వేలో భాగంగా ముందుగా తగాదాలు లేని గ్రామాల్లో సర్వే నిర్వహించాలని తర్వాత అటవీ భూములు ప్రభుత్వ భూములు కలిసి వున్న గ్రామాలల్లో సర్వే నిర్వహించాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement