Friday, April 26, 2024

హైదరాబాద్ : ఇచ్చంపల్లా? జానంపేటా?

నదుల అనుసంధానంపై కేంద్రం సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు కనబడుతోంది. ప్రధానంగా గోదావరి- కావేరిపై స్పీడు పెంచింది. దక్షిణ భారతదేశంలో నీటికరువు నివారించే వ్యూహాలపై చర్చలు చేస్తోంది. గోదావరి–కావేరీ నదుల అనుసంధానాన్ని తెలంగాణలోని ఇచ్చంపల్లి నుంచి చేపట్టడానికే జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) మొగ్గుచూపుతోంది. గోదావరి జలాలను జానంపేట నుంచి నాగార్జునసాగర్‌ వరకు, అక్కడి నుంచి పెన్నా ద్వారా కావేరికి మళ్లించడంపై అధ్యయనం జరిపిన ఈ సంస్థ.. ఇదే అంశంపై రాష్ట్రాలతో చర్చించి తాజాగా ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌కు మళ్లించేలా ప్రతిపాదన సిద్ధం చేసింది. జానంపేట నుంచి 247 టీఎంసీలు మళ్లించేలా తయారుచేసిన ప్రత్యామ్నాయం పైనా పరిశీలన జరుపుతోంది. నదుల అనుసంధానంపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఈ అంశాలపై గురువారం చర్చించనుంది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు, నదుల అనుసంధాన కమిటీ చైర్మన్‌ వెదిరే శ్రీరాం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేంద్ర జల సంఘం చైర్మన్‌, ఎన్‌.డబ్యు.డి.ఎ. డైరెక్టర్‌ జనరల్‌తో సహా 11 మంది సభ్యులు, పది మంది ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొననున్నారు. అజెండాలో గోదావరి- కావేరికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జలశక్తి శాఖ వర్గాలు తెలిపాయి. ఇచ్చంపల్లి వద్ద 175 టీఎంసీల నీటి మిగులు ఉంటుందని, ఛత్తీస్‌గఢ్‌కి కేటాయించి వాడుకోలేని నీరు సైతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇదే అనువైన ప్రాంతంగా భావిస్తున్నట్లు తెలిసింది. దీనివల్ల తెలంగాణలో అధిక ఆయకట్టుకు మేలు కలుగుతుందని చెబుతున్నారు.
రాష్ట్రాలకు డీపీఆర్‌లు
గోదావరి- కావేరి అనుసంధానం ప్రత్యామ్నా యంలో భాగంగా గోదావరి- కృష్ణా, కృష్ణా- పెన్నా, పెన్నా- కావేరి అనుసంధానాల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారుచేసిన ఎన్‌డబ్ల్యుడీఏ వాటిని 2019 మార్చిలో భాగస్వామ్య రాష్ట్రాలకు అందజేసింది. 2020 సెప్టెంబర్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకొని నివేదికలను సవరించింది. 2050 వరకు బేసిన్‌ పరిధిలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మిగిలిన నీటిని ఒక బేసిన్‌ నుంచి ఇంకో బేసిన్‌కు మళ్లించాలని ప్రతిపాదించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు గోదావరి నీటిని పక్కబేసిన్‌లో వినియోగించుకో వడానికి సైతం పలు ఎత్తిపోతల పథకాలను చేపట్టా యని నివేదికలో వెల్లడించింది. ఇందుకు ప్రత్యామ్నా యంగా భద్రాద్రి జిల్లా పినపాక మండలంలోని జానంపేట ప్రాంతం నుండి గోదావరి ద్వారా నీటిని తీసుకునే ప్రతిపాదనను సైతం రూపొందించింది. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఇచ్చంపల్లి టు నాగార్జునసాగర్‌ మెరుగైన ప్రతిపాదనగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. గోదావరి నుంచి కావేరి వరకు మళ్లించే నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు వినియోగించు కొనేలా ప్రతిపాదన ఉండగా, కర్ణాటక, కేరళలు కూడా వాటా కోరుతున్నాయి. మాకేంటి అని ప్రశ్నిస్తున్నాయి. మొదటి దశలో గోదావరి మిగులు జలాలతో చేపట్టడం, రెండో దశలో మహానది నుంచి నీటిని మళ్లించడం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనలకు ఇందులో చోటు కల్పించడం చేయాలని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement