Friday, April 26, 2024

షాంఘై సహకారం ఫలిస్తుందా?

ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ కూటమిలోని దేశాలు సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడమే లక్ష్యంగా ఇది ఏర్పడింది. చైనా ఆకాంక్షలు పెరిగిపోవడంతో సభ్య దేశాలకు ఈ కూటమి తగిన రీతిలో తోడ్పాటు అందించలేకపోతున్నది. మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ సమావేశాలలో అందరిలో ఆలోచనలు రేకెత్తించే రీతిలో ప్రసంగించారు. కోవిడ్‌ -19 ప్రభావం, ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఒక్క చమురు విషయంలోనే కాకుండా వంటనూనెలు, గోధుమ వంటి నిత్యావసరాలకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఎంతో విలవిలలాడుతున్నాయి. ఆహార సంక్షోభంలో పదుల సంఖ్యలో దేశాలు అల్లల్లాడుతున్నాయి.

ప్రధానంగా ఆ రెండు దేశాలనుంచి ఆహార ధాన్యాలు, వంటనూనెలపై ఆధారపడిన ఆఫ్రికా దేశాలు ఆకలితో అలమటిస్తున్నాయి. అయితే, పిల్లికి చెలగాటం సామెతలా అధిక ధరల మంటల నుంచి చైనా, రష్యా చలి కాచుకు నేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ రెండు దేశాల ప్రధాన లక్ష్యం అమెరికా. మిగిలిన దేశాలు ఏం పాపం చేశాయి. చైనాకి మన దేశంపై అక్కసు పెరగడానికి ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు మన దేశం మద్దతు ఇవ్వకుండా తటస్థవైఖరిని అనుసరించడమే. ఈ యుద్ధంలో రష్యా ఎదురుదెబ్బలు తింటోంది. అయినప్పటికీ చైనా మాయమాటల్లో పడుతున్నది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లు జరిపే చర్చల్లో భారత్‌ ప్రస్తావన ఉంటుంది. భారత్‌పై రష్యాని ఉసిగొల్పేం దుకు చైనా ప్రయత్నించవచ్చు.

అయితే, రష్యా అంత తొందరగా భారత్‌ను దూరం చేసుకోదు. గత అనుభవాల దృష్ట్యా రష్యా, చైనాను ఎంతమాత్రం నమ్మలేదు. ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర ఆర్థిక సంబంధాలపై కాకుండా మన ప్రధాని నరేంద్రమోడీ కోవిడ్‌, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల దెబ్బతిన్న కనెక్టివిటీ, స్థితిస్థాపకత్వాలను పునరుద్ధరించాల్సిన అవసరం గురించి నొక్కి వక్కాణించారు. భారత్‌ ప్రపంచంలో ఏ దేశంతోనైనా, ఎప్పుడైనా ఒప్పందాలను కుదుర్చుకునేటప్పుడు వసుధైక కుటుం బ భావనతోనే చేస్తుందని ప్రధాని మోడీ మరోసారి స్పష్టం చేశారు. సప్లయ్‌ చైన్స్‌ దెబ్బతినడం వల్ల చమురు, నిత్యావసరాలు అందక పలు దేశాలు వర్ణించలేని ఇబ్బం దులను ఎదుర్కొంటున్నాయి. ఇందుకు పాకిస్తాన్‌ ప్రధా ని షెహబాజ్‌ షరీఫ్‌ పుతిన్‌తో తమ గోడును వెళ్లబోసు కోవడమే ఉదాహరణ.

పాకిస్తాన్‌ ఆర్థిక దుస్థితికి స్వయం కృతమే ప్రధాన కారణమైనప్పటికీ, ఇటీవల సంభవించి న వరదలు, కనీవినీ ఎరుగనివి కావడంతో ఆ దేశం ఆర్థిక మూలాలు బాగా దెబ్బతిన్నాయి. అలాగే శ్రీలంక పరిస్థితిని కళ్లారా చూశాం. చిన్న దేశాల దయనీయ స్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదు.అమెరికాని దాటిపోయి అగ్రరాజ్య హోదా సంపాదించుకోవాలన్నది చైనా ఆకాంక్ష. ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని ఇప్పటికే గ్రహించాయి. ప్రతిసారి షాంఘై సహకార సంస్థ సమావేశాలలో యావత్‌ ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడమే ఆనవాయితీ. ప్రస్తుత పరిస్థితిలో షాంఘై సభ్య దేశాలకు చైనా, రష్యాలు ఎటువంటి సందేశం ఇవ్వనున్నాయి? సభ్య దేశాల ప్రజల ఈతి బాధలను తీర్చగలవా? ఇందుకోసం ఆంక్షల అడ్డంకులను దాటుకు ని విశాల హృదయంతో సాయం అందిస్తాయా? ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగంలో ఈ ప్రశ్నలే దాగి ఉన్నాయి.

ఆర్థిక, ఔషధ, ఆరోగ్య రంగాల్లో భారత్‌ సాధించిన ప్రగతిని వివరించిన ప్రధాని నరేంద్రమోడీ ఎస్‌సీఓ సభ్య దేశాలకు ఆయా రంగాల్లో సంపూర్ణ సహకారం అందిం చేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించడం విశేషం. స్టార్టప్‌ ల రంగంలో భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించిందని, ఏకం గా 70వేల స్టార్టప్‌లు వివిధ రంగాల్లో పనిచేస్తున్నాయని, చెప్పారు. ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న భారత్‌ సభ్య దేశాలకు ఆయా రంగాల్లో సహకారం అందించేందుకు ప్రత్యేక కార్యనిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేసిందని కూడా చెప్పారు. ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చిరుధాన్యాల ఉత్పత్తిని, వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు.

- Advertisement -

2023ను అంతర్జా తీయ చిరుధాన్యాల సంవత్సరంగా పాటించాల్సి ఉన్నం దున ఈ విషయంలో సభ్యదేశాలు చొరవ తీసుకోవాలని కోరారు. కరోనా సమయంలో భారత్‌ అన్ని దేశాలకు వ్యాక్సిన్‌లను సరఫరా చేసింది. దివాళా తీసిన శ్రీలంకకు ఆహార ధాన్యాలను సరఫరా చేసింది. అనేక దేశాలకు నిత్యావసరాలను పంపిణీ చేసింది. పెద్దమనసుతో వ్యవ హరించిన భారత్‌, ఇలాంటి స్పందన ఇతర దేశాలనుంచి కూడా రావాలని కోరుకుంటోంది. అదే భావన ప్రధాని తన ప్రసంగంలో వ్యక్తం చేశారు. ఆధిపత్య కాంక్షతో రగిలిపోతున్న చైనాకు ఇది అర్థం అవుతుందా?

Advertisement

తాజా వార్తలు

Advertisement