Tuesday, May 28, 2024

Editorial : పాక్ దుర్బుద్ధి.. ఇరాన్‌ సాచివేత!

కాశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌కు మరో మారు పరాభవం ఎదురైంది. కాశ్మీర్‌ అంశాన్ని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తమ దేశంలో పర్యటిస్తున్న ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీమ్‌ రైసీతో ప్రస్తావించినప్పటికీ, ఆయన నుంచి సరైన స్పందన రాలేదు.షెహబాజ్‌ రెండు, మూడు సార్లు కాశ్మీర్‌ ప్రస్తావన చేసినప్పటికీ, ఇబ్రహీమ్‌ రైసీ పట్టించుకోలేదు. షరీఫ్‌ కాశ్మీర్‌ అంశం గురించి ప్రస్తావిస్తూ ఉంటే,రైసీ మరో అంశం ప్రస్తా వించడాన్ని బట్టి కాశ్మీర్‌పై మాట్లాడేందుకు తనకు ఇష్టం లేదనే విషయం చెప్పకనే చెప్పారు.

- Advertisement -

భారత్‌తో ఇరాన్‌కి ఎంతో కాలంగా సత్సంబంధాలున్నాయి.పాకిస్తాన్‌తో పోలిస్తే భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల ను అత్యంత విలువైనవిగా ఇరాన్‌ భావిస్తోంది.భారత్‌ని నమ్మ దగినమిత్ర దేశంగా పరిగణిస్తోంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దాడుల విషయంలో మొదట ఇజ్రాయెల్‌ని భారత్‌ సమర్ధించినా, అక్కడి పరిస్థితులను అంచనా వేసిన తర్వాత ఇజ్రాయెల్‌ దాడులను ఖండించింది భారత్‌ మాత్రమేనన్న సంగతి ఇరాన్‌కి తెలుసు. అమెరి కాతో భారత్‌ సంబంధాలు వ్యూహాత్మకమైనవని ఇరాన్‌ పరిగణిస్తోంది. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్‌ ఉన్న సమ యంలో ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను తగ్గిం చాలని హూంకరించినప్పటికీ, భారత్‌ తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకుంది.ఈ విషయంలో భారత్‌ తన సర్వసత్తాక ప్రతిపత్తిని వదులుకునేది లేదని చాలా స్పష్టంగా, సూటిగా అమెరికాకు స్పష్టం చేసింది.

భారత్‌ లో ఇరాన్‌కి నచ్చిన ముఖ్యాంశం ఇదే.అందుకే, భారత్‌తో మైత్రిని ఇరాన్‌ చాలా విలువైనదిగా పరిగణిస్తోంది. అంతేకాక, భారత్‌ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదన్ననియమాన్ని తుచ తప్పకుండా ఇరాన్‌ అమలు జేస్తోంది.భారత్‌లోకి సరిహద్దుల మీదుగా ఉగ్రవాదులను పంపి హింసాత్మక కార్యకలాపాలను సాగిస్తున్న లష్కర్‌ఎ తోయిబా, జైష్‌ ఏ మహ్మద్‌ వంటి సంస్థలకు పాకిస్తాన్‌ ఆశ్రయం ఇస్తున్న సంగతి ఇరాన్‌కి తెలుసు. ముంబాయి పేలుళ్ళ కేసు నిందితులంతా పాకిస్తాన్‌లోనే తలదాచుకున్న సంగతీ ఇరాన్‌కితెలుసు. ముఖ్యంగా దావూద్‌ ఇబ్రహీమ్‌ వంటి కరుడుకట్టిన ఉగ్రవాదులకు పాక్‌ స్వర్గధామంగా ఉందన్న వాస్తవాన్ని ఇరాన్‌ గుర్తించింది.పాకిస్తాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని సైనికాధికారులు తరచూ కూలదోస్తూ అధికారాన్ని చేజిక్కించుకుంటారన్న విషయం ఇరాన్‌కి తెలుసు. పాకిస్తాన్‌ నిధుల కోసం అమెరికాతో,చైనాతో సన్నిహితం గా మెలుగుతోందన్న విషయం కూడా ఇరాన్‌కి తెలుసు. అందువల్లనే పాక్‌తో మైత్రి కొనసాగించినా సమాన దూ రాన్ని పాటిస్తోంది.

ఇరుదేశాలకు సంబంధించిన ఆసక్తిక రమైన అంశాలపైనే రైసీ షెహబాజ్‌తోచర్చలు జరిపారు. పాక్‌కి ఆర్థిక సాయం అందించే విషయంలో రైసీ స్పష్టమై న హామీ ఇవ్వలేదు.ఎందుకంటే, పాకిస్తాన్‌ ఇప్పటికే అరబ్‌ దేశాలన్నింటి నుంచి అప్పులు చేసింది.పాక్‌ మాటల్లో నిలకడ,నిజాయితీ లేదన్న సంగతి ఇరాన్‌కి తెలుసు.చైనాకి వంత పాడడటం ఇరాన్‌కి నచ్చలేదు. ఉగ్రవాదుల స్థావరాలపై ఇరుదేశాలూ పరస్పరం దాడు లు జరుపుకున్న నేపథ్యంలోఇరుదేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తత గురించి రైసీ,షెహబాజ్‌లు చర్చించారు. నిజా నికి ఈ దాడులు పాక్‌ ప్రేరణతో పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ సాగించినవే. ఇజ్రాయెల్‌ దళాలు గాజా ప్రాంతంపై జరుపుతున్న దాడుల విషయంలో పాక్‌ దృఢవైఖరిని అనుసరించక పోవడాన్ని ఇరాన్‌ తప్పుపడుతోంది. హమాస్‌ దళాలకు పాక్‌ మద్దతు పెద్ద పరిగణనలోకి రాకపోయినప్పటికీ, ఇస్లామిక్‌ దేశాలన్నీ హమాస్‌కి మద్దతు ఇవ్వాలన్న పిలుపును పాక్‌ పాటించడం లేదన్న గుర్రు ఇరాన్‌కి ఉంది. నిధుల కోసం అవసరమైతే అమెరికా ఆదేశాలకు తగినట్టు పాక్‌ నడుచుకుంటుందన్న విషయం ఇరాన్‌కి తెలుసు.అమెరికాను ప్రధాన శత్రువుగా పరిగణిస్తున్న ఇరాన్‌ పాక్‌ ద్వంద్వ వైఖరి కారణంగానే ఆ దేశాన్ని దూరం గా పెడుతోంది.

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ఇటీవల జరిపిన దాడులకు మద్దతుకూడగట్టేందుకే, ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ పర్యటన జరుపుతున్నట్టు దౌత్య వర్గాలు తెలిపాయి. అమెరికా శత్రువులను కూడగట్టడంలో ఆయన ఇప్పటికే విజయం సాధించారు. సిరియాలో ఇరాన్‌ స్థావరాలపై ఇజ్రాయెల్‌ దాడులను అమెరికాయే పురికొల్పిన సంగతిని మిత్ర దేశాలకు తెలియజేయడమే ఆయన పర్యటన ముఖ్యోద్దేశ్యం. పాకిస్తాన్‌లోని బలూ చిస్థాన్‌ నుంచి ఇరాన్‌కి వాణిజ్యం విషయంలో ఎదురవు తున్న స మస్యల గురించి కూడావారు చర్చించారు. అంతర్జాతీయ వేదికలపైనే కాకుండా,తమ దేశపర్యటన కు వచ్చే ఇతర దేశాల అధినేతల వద్ద కాశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించడం పాక్‌ దుర్బుద్ధికి నిదర్శనం.

Advertisement

తాజా వార్తలు

Advertisement