Tuesday, April 30, 2024

నేటి సంపాద‌కీయం – ఎస్‌బీఐ ‘ఉచిత’ హెచ్చరిక!

ఎన్నికల్లో గెలుపు కోసం వివిధ పార్టీలు చేస్తున్న వాగ్దానాల భారం ప్రభుత్వ ఖజానాలపై తడిసిమోపెడు అవుతోంది. వీటిని అమలు జరపలేక రాష్ట్రాలు ఆర్థికంగా విలవిలలాడుతున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుని పోతున్నాయి. ఉచిత విద్యుత్‌తో ప్రారంభమైన ఈ ఉచిత పథకాల పరంపర ఇంకా రకకరాలుగా విస్తరించి కొన సాగుతోంది. ఉచిత విద్యుత్‌ వల్ల కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నా, అన్నదాతల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు అమలు జేశారు. అప్పట్లోనే ఉచిత విద్యుత్‌పై ఆర్థిక నిపుణులు, ప్రపంచ బ్యాంకు వంటి అంత ర్జాతీయ ఆర్థిక సహాయ సంస్థలు అభ్యంతరం తెలిపాయి. అయితే, ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు అమలు జరగాలన్న ఉత్తమ ఆశయంతో ఆనాడు ఉచిత విద్యుత్‌ను అంగీకరించారు. అంతేకాకుండా ఉత్పత్తికి దోహదం చేసే కార్యక్రమాలకు, పథకాలకు ఉచితంగా సేవలందించడం తప్పుకాదని ఆర్థిక రంగానికి చెందిన పలువురు సమర్ధించారు. సంక్షేమ రాజ్యంలో బలహీనులు, పేదలు, ఆపన్నులను ఆదుకొవడమనేది ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమైనది కావడం వల్ల ఉచిత విద్యుత్‌కి పెద్దగా అభ్యంతరం రాలేదు. ఎన్నికల సందర్భంగా జనాన్ని ఆకర్షించడం కోసం తమిళనాడులో ఫ్రిడ్జ్‌, టీవీ సెట్లు, గ్రైండర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఉచితంగా పంపిణీ చేయడంపై కూడా విమర్శలు వచ్చాయి. అప్పటకీ అదే పసరాకాష్టగా అనిపించింది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికే ఇలాంటివన్నీ పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు కూడావచ్చాయి. ఉభయ డిఎంకెలు పోటాపోటీగా ఇలాంటి వస్తువు లెన్నింటినో ప్రజలకు పంపిణీ చేసేవి. ఇప్పటికీ చేస్తున్నాయి.

ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కూడా ఇలాంటి అలవికాని వాగ్దానాలను రాజకీయ పార్టీలు చేశాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో అధికారంలోకి రావడం కోసం ఉచిత విద్యుత్‌ మాత్రమే కాకుండా మురికి వాడల్లో నివసించేవారికి ఉచితంగా ఇళ్ళు కట్టించి ఇస్తామనీ, మురికి వాడల్లో పిల్లలకు ఇంటర్మీ డియట్‌ వరకూ ఉచిత విద్య చెప్పిస్తామని ఇలా ఎన్నో వాగ్దానాలు చేసింది. వీటినితీర్చేందుకు నిధులులేక ఇప్పుడు విలవిలలాడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం కూడా ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలు కోసం రుణాలు చేస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రాలు ఈ మాదిరిగా చేసిన, ఇప్పటికీ చేస్తున్న వాగ్దానాల వల్ల ఆర్థిక భారం పెరిగిపోయి, ప్రభుత్వాలు రుణాల ఊబిలో కూరుకునిపోయే పరిస్థితి ఏర్పడవచ్చని ఎస్‌బిఐ ఆందోళన వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాలు, చత్తీస్‌గఢ్‌, బీహార్‌, బెంగాల్‌, జార్ఖండ్‌, కేరళ వంటి రాష్ట్రాలు తమ రెవిన్యూ ఆదాయంలో ఐదు నుంచి పది శాతం మొత్తాన్ని ఉచిత పథకాలకూ, రుణ మాఫీకి ఖర్చు చేస్తున్నాయనీ, వీటి వల్ల ఆయా రాష్ట్రాలలో అభివృద్ది కార్యక్రమాలకు, ప్రభుత్వాలను నడపడానికి నిధుల కొరత తీవ్రంగా ఏర్పడే ప్రమాదం ఉందని ఎస్‌బిఐ హెచ్చరించింది. గతంలో కేంద్ర ప్రణాళిక సంఘం రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాలపైనా, ముఖ్యంగా ఉచిత వాగ్దానాలపైనా పర్యవేక్షణ జరిపేది.

ఇప్పుడు ఆ సంస్థ స్థానే వచ్చిన నీతి ఆయోగ్‌ అటువంటి పర్యవేక్షణ చేస్తున్నదనే అనుకోవాలి. అయినప్పటికీ, పార్టీలు తమ వాగ్దానాల అమలుకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. యూపీఏ హయాంలో ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఎరువులు, తదితరాల సబ్సిడీ కోసం ప్రభుత్వం ఏటా మూడు లక్షల కోట్ల రూపాయిలు పైగా వెచ్చిస్తోందనీ, ఈ పద్దును తగ్గించుకోకపోతే ఆర్థికాభివృద్ధి రేటు పెరగదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహం వ్యవసాయ రంగానికి ఇవ్వడం లేదనీ, అందువల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్న వాదనలు అప్పట్లో వినిపించాయి. అలాగే, యూపీఏ హయాంలో ఒకేసారి 70 వేల కోట్ల రూపాయిల మేరకు రైతుల రుణ మాఫీ చేసినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంలో రుణమాఫీ లేకపోయినా, రైతులకు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ వంటి పథకాల ద్వారా సాయాన్ని అందజేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు జేస్తోంది. ఇవన్నీ ప్రణాళికేతర వ్యయం కిందికే వస్తాయి. దీంతో రిజర్వుబ్యాంకు కొర్రీలు వేస్తూ ఉంటుంది. ఇలాంటివాగ్దానాలు, పథకాల అమలుపై కేంద్రం జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఏకాభిప్రాయం కోసం కృషి చేయాలని ప్రణాళికావేత్తలు సూచించినప్పటికీ, వేర్వేరు పార్టీలు రాష్ట్రాల్లో అధికారంలో ఉండటం వల్ల ఏకాభిప్రాయాన్ని సాధించడం సాధ్యం కావడం లేదు. ఉచిత వాగ్దానాలను సాధ్యమైనంత మేరకు తగ్గించుకుంటే ఆర్థిక పరిస్థితిమెరుగుపడుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement