Monday, May 20, 2024

Andhra Pradesh – బ‌రిలో..బ‌కెట్‌! – ఎన్డీఏకి హార్ట్ ఎటాక్

ఏపీలో జనసేన సింబల్‌కు ఎసరు
కూట‌మి అభ్యర్థి పేరుతో నకిలీల ఎంట్రీ
గాజు గ్లాసుకు బకెట్‌తో చిక్కులు
60 స్థానాల్లో పోటీకి దిగిన‌ స్వతంత్ర ఆర్మీ
కూటమి అభ్యర్థుల ఓటమే లక్ష్యం
ఆందోళ‌న‌లో టీడీపీ, జ‌న‌సేన‌ అభ్య‌ర్థులు
ప్ర‌త్యామ్నాయ వ్యూహాలు సిద్ధం చేస్తున్న చంద్ర‌బాబు, ప‌వ‌న్‌
హైకోర్టులో పిటిషన్​ దాఖలు.. ఇంప్లీడ్​ అయిన టీడీపీ
24 గంటల్లోగా నిర్ణయం వెలువరిస్తామన్న ఈసీ

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: చట్టం తన పని తాను చేస్తుంది. ఇది నిజం.. కానీ, అదే చట్టాన్ని అన్వయించుకోవటం రాజకీయ పార్టీల నైజం. ఇది పచ్చి నిజం. ఏపీలో జనసేన పార్టీ గుర్తు గ్లాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థులు గుంజుకోవటం యాదృశ్చికమా? లేక రాజకీయ కుట్రా? అనే చ‌ర్చ మొద‌లైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు, బీఎస్పీతో క‌లిసి జనసేన పోటీ చేసింది. జనసేనకు 5.53 శాతం, సీపీఐకి 0.11 శాతం, సీపీఎంకు 0.32 శాతం, బీఎస్పీకి 0.28 శాతం ఓట్లు వచ్చాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జనసేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలంటే కనీసం 6 శాతం ఓట్లు రావాలి. ఈ స్థితిలో జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు త్రిశంకు స్వర్గంలో కొట్టి మిట్టాడుతుండగా.. ఈ సారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి చావు దెబ్బ కొట్టే రీతిలో ప్రత్యర్థులు పథకం రచించారు. రెబల్ అభ్యర్థులను రంగంలోకి దించారు. జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తే.. ఆ అభ్యర్థి పేరిటే మరో నకిలీ అభ్యర్థిని రంగంలోకి దించారు. గాజు గ్లాసు గుర్తుపోలిన బకెట్ గుర్తును ఎంచుకున్నారు.

- Advertisement -

జన సైన్యమే టార్గెట్ ..

ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును ధ్వంసం చేయటమే లక్ష్యంగా.. ఏపీలో రాజకీయ చదరంగం పావులు కదిలాయి. మరీ ముఖ్యంగా జనసైన్యాన్ని నిర్వీర్యం చేయటమే లక్ష్యంగా వ్యూహరచన జరపటమే కాదు.. అమలులో ప్రతిపక్ష పార్టీని బాబోయ్ అనిపించిన తీరు.. రాజకీయ పరిశీలకులనే ఆశ్చర్య పరిచింది. ఇలాంటి వ్యూహం కూడా ఉంటుందా అని నోరు వెళ్లబెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇక టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో రెబల్ అభ్యర్థులను ప్రోత్సహించారు. జనసేన పార్టీకి గుర్తింపు లేని స్థితిలో గాజు గ్లాసును కోరుకున్నారు. ఇక్కడ జనసేనకు నష్టమేంటీ? కూటమికి కష్టమేంటీ? అంటే.. ప్రభుత్వం ఓటు చీలకూడదని జట్టుకట్టిన కూటమి ఓటు బ్యాంకునే గుల్ల చేయటం ఇక్కడి వ్యూహంగా క‌నిపిస్తోంది.

ఓట్లు చీల్చ‌డ‌మే మెయిన్ టార్గెట్‌

కనీసం రెండు మూడు వేల ఓట్లు చీలినా.. ఓటమి అంచుల్లోకి చేరక తప్పదు అనే థియ‌రీని ఇక్క‌డ పాటిస్తున్నారు. సరీగా ఎక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తాడో.. అక్కడే గాజు గ్లాసు కోసం బినామీ అభ్యర్థిని రంగంలో దింపుతున్నారు. అయితే, ఈ గుర్తును ఇతర స్వంతంత్ర అభ్యర్థులకు ఇవ్వవద్దని కూటమి న్యాయ పోరాటానికి దిగింది. టీడీపీ. బీజేపీ కూటమితో 10 శాతం పైగా సీట్లల్లో పోటీ చేస్తున్నామని జనసేన ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. ఇతరులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించొద్దని విజ్ఞప్తి చేసింది. 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తోంది. మిగిలిన చోట్ల టీడీపీ, బీజేపీకు మద్దతు ఇస్తోంది. ఫ్రీ సింబల్ జాబితాలో ఉండటంతో మిగిలిన నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. దీంతో కూటమి పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.

కోస్తా.. ఉత్తరాంధ్రలో కూటమికి దడ

విశాఖ ఉమ్మడి జిల్లాలో ఒక ఎంపీ, రెండు అసెంబ్లీ సీట్లలో ఇండి పెండెంట్లకు గాజు గ్లాస్ కేటాయించారు. జనసేన ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న గాజువాక, భీమిలిలో ఇండిపెండెంట్లు గాజు గ్లాస్ గుర్తును సింబల్ దక్కించుకున్నారు. విజయనగరం అసెంబ్లీ బరిలో టీడీపీ రెబల్ అభ్యర్థి మీసాల గీతాకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. అనకాపల్లి ఎంపీకి కృష్ణ స్వరూప్‌కు గ్లాస్ సింబల్ దక్కింది. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, జగ్గంపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ స్థానం నుంచి గుర్తింపు పొందిన పార్టీల నుంచి ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉండగా 9మంది ఇండిపెండెట్లు ఉంటే.. పాలపర్తి జాన్ సన్ అనే స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు.

గాజు గ్లాసు గుర్తుతో ఇత‌రులు పోటీ..

ఏలూరు జిల్లా చింతలపూడి లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మువ్వల ఎస్తేరు రాణికి ఇక, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు వచ్చింది. విజయవాడ ఎంపీ స్థానంతో పాటు జగ్గయ్యపేట, కైకలూరు, మైలవరం, మచిలీపట్నం అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు కోరగా జనసేన గుర్తు గాజు గ్లాసును అప్పగించారు. మచిలీపట్నం జనసేన అభ్యర్థిగా ఎంపీ బాలశౌరి విస్తృత ప్రచారం చేశారు. ఇక్కడ రెండు ఓట్లు గాజు గ్లాసుకే పడితే.. బందరులో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రకు చావు దెబ్బే. ఇక వైసీపీ అభ్యర్థికి విజయం ఖాయం ఇది ఎత్తుగడ. పల్నాడు జిల్లామాచర్ల , వినుకొండ అసెంబ్లీ స్థానాలకు ఇండిపెండెంట్ అభ్యర్థులకు, గుంటూరు జిల్లా మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థికి , గుంటూరు పశ్చిమ లో ఇండిపెండెంట్ అభ్యర్థికి, గుంటూరు పార్లమెంట్ స్థానంలో నవతరం పార్టీ పార్లమెంట్ అభ్యర్థికి గాజు గ్లాసును గుర్తుగా కేటాయించారు.

రాయలసీమలోనూ గ్లాసు ఎఫెక్ట్‌

తిరుపతి జిల్లాలోనూ పలువురు స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. శ్రీకాళహస్తీ ఇండిపెండెంట్‌ అభ్యర్థి భాస్కర్ తీగలకు, మదనపల్లెలో స్వతంత్ర అభ్యర్థి షాజహాన్ బాషాకు, చంద్రగిరిలో మరో ఇండిపెండెంట్ అభ్యర్ధికి, నగరిలో జయరామయ్యకు, నెల్లూరు జిల్లా కావలి, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తు అప్పగించారు. కడప జిల్లాలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు. మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో స్వతంత్రులు కోరడంతో గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. రాజంపేట ఎంపీ స్థానంలో ఎట్టకేలకు పులి శ్రీనివాసులు ఇండిపెండెంట్ అభ్యర్థికి కూడా గాజు గ్లాసు గుర్తు దక్కింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో డోన్, పత్తికొండ, ఆదోని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసుగుర్తును కేటాయించారు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల స్వతంత్ర అసెంబ్లీ అభ్యర్థలకు కూడా గాజు గ్లాస్ గుర్తు దక్కింది.. అనంతపురం జిల్లాలో మూడు చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించారు.. తాడిపత్రి, రాప్తాడు, గుంతకల్లు అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తు దక్కింది. టీడీపీ నుంచి ముఖ్య నేతల బుజ్జగింపు ఫలితంగా నూజివీడు నుంచి ముద్రబోయిన వెంకటేశ్వర రావు, మాడుగుల నుంచి పైలా ప్రసాద్, మడకశిర నుంచి సునీల్ కుమార్ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కానీ, మరి కొన్ని కీలక నియోజకవర్గాల్లో మాత్రం రెబల్స్ పోటీలో నిలిచారు.

ప్రత్యామ్నయ వ్యూహంలో…

గాజుగ్లాసు గుర్తుతో కూటమి అభ్యర్థులకు తీరని నష్టం కల్పించే స్వతంత్రుల వ్యూహం నుంచి కోలుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాధి నేత‌ పవన్ ప్రతి వ్యూహాన్ని రచించారు. తొలుత న్యాయ పోరాటాన్ని ఎంచుకున్నారు. హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. ఈ అభ్యంతరాలపై 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని ఈసీ హైకోర్టుకు వివరించింది. ఇక.. కూటమి రెబల్స్‌ని సస్పెండ్ చేస్తూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. హైకోర్టు పిటీషన్‌లో డీపీపీ సైతం ఇంప్లీడ్ అయ్యింది. ఇక‌.. పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి కేంద్రీకరించారు. స్వతంత్ర అభ్యర్థులు అంతా అధికార పార్టీ పెయిడ్ బ్యాచ్ అని ప్రచారం చేయాల‌న్ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. క్షేత్ర స్థాయిలో గాజు గ్లాసు గుర్తుపై అసలు విషయాలను ప్రచారం చేయాలని, నకిలీ అభ్యర్థుల పేర్లు ఉంటే.. బ్యాలెట్‌లో తమ సంఖ్య ఆధారంగా ఓటు వేయించాలని పార్టీ లీడ‌ర్ల‌కు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement