Sunday, May 19, 2024

నేటి సంపాదకీయం-ఇదేనా చేయూత?

స్వాతంత్య్రోద్యమంలో భాగంగా చేనేత ఉద్యం ఉవ్వెత్తున సాగింది.దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఉద్యమంలో వేలాది కార్మికులు పాల్గొని ఉద్యమానికి అండగా నిలిచారు.. తెలుగు రాష్ట్రాల్లో 76వేల మగ్గాలు ఉండగా, తెలంగాణలోని సిరిసిల్లలోనే 46వేల మగ్గాలున్నాయి. ఆంధ్రప్రాంతంలో చీరాల,మంగళగిరి తదితర ప్రాంతాల్లో చేనేత మగ్గాలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. చేనేత కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసే పార్టీల నాయకులు అధికారంలోకి రాగానే ఈ రంగంపై పెనుభారాన్ని మోపు తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ గత ఆగస్టులో చేనేత దినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తూ మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా చేనేతకు సౌకర్యాలను కల్పించ నున్నట్టు ప్రకటించారు.తీరాచూస్తే చేనేత ఉత్పత్తులపై వస్తు,సేవా పన్ను (జీఎస్టీ)ని 5 శాతం నుంచి 12 శాతానికి కేంద్రం పెంచడం చేనేత వర్గాలకే కాకుండా బడుగు,బలహీనవర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

సామాన్యులు వినియోగించే వస్తువులపైనా, వస్త్రాలపైనా జీఎస్టీ ని తగ్గించాలనీ,వీలైతే తొలగించాలని చాలాకాలంగా రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. జీఎస్టీ తగ్గించాల్సిందిపోయి చేనేత ఉత్పత్తులపై పెంచడాన్ని దేశంలో సామాన్య ప్రజానీకం తీవ్రంగా గర్హిస్తోంది.మగ్గాలపై అందమైన వస్త్రాలను ఉత్పత్తి చేయడంలో తెలుగురాష్ట్రాల్లో చేనేత కార్మికుల నైపుుణ్యం అంతర్జాతీయంగా ఏనాడో గుర్తింపు పొందింది. బ్రిటిష్‌ వారి పాలనలో బ్రిటిష్‌ రాణికి అగ్గిపెట్టెలో పట్టే చేనేత చీరను కానుకగా పంపించిన మన చేనేత కార్మికుడు ఆమె ప్రశంసలు అందుకున్నాడు. చేనేత పరిశ్రమ వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. మిల్లులతో పోటీ పడి చేనేత కార్మికులు ఆకర్షణీయమైన డిజైన్లలో చీరెలు, దుప్పట్లు, కర్టెన్లు తయారు చేస్తున్నారు.విదేశాల్లో మన చేనేత వస్త్రాలకు మంచి గిరాకీ ఉంది.అంతర్జాతీయంగా, జాతీయంగా జరిగే వస్త్ర ప్రదర్శనల్లో చేనేత వస్త్రాలు ఎన్నో అవార్డులను గెల్చుకున్నాయి. ఇప్పటికీ గెల్చుకుంటున్నాయి.

చేనేత కార్మికుల్లో అంకితభా వం, పట్టుదల, నైపుణ్యం, దానిని ప్రదర్శించే ఓరిమి ఉన్నాయి. మహాత్మాగాంధీ స్వాతం త్య్రోద్యమంలో విదేశీ వస్త్ర బహి ష్కరణకు పిలుపు ఇస్తూ చేనేత వస్త్రాలను ధరించాలని గళమెత్తారు. మగ్గాలపై వస్త్రాలనేతను ప్రోత్సహించడం కోసమే స్వాతంత్య్రానంతరం ప్రభుత్వ శాఖల్లో చేనేత వస్త్రాలను వాడాలనే సర్క్యులర్లు తొలిరోజుల్లో వెలువడ్డాయి. అయితే,మిల్లు వస్త్రాల పోటీ పెరగడంతో అలాంటి సర్క్యులర్లన్నీ మూలబడ్డాయి. ముంబా యి, తదితర ప్రాంతాల్లో నూలు మిల్లుల ప్రాబల్యం పెరగడం, మిల్లు యజమానులకు రాజకీయ నాయకుల అండ ఉండటంతో ప్రభుత్వంలో తమ మాటను నెగ్గించుకోగలు గుతూ వస్తున్నారు. చేనేత రంగంపై ప్రభుత్వం శీతకన్నుకు రాజకీయ ప్రాబల్యం లేకపోవ డమే కారణం. చేనేత రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఎమ్మెల్యేలు,ఎంపీలుగా ఎన్నికై ఈ రంగానికి సాయం కోసం ఒత్తిడి తెస్తూనే ఉన్నారు.అయితే, ఆధునిక మగ్గాలు, పవర్‌ లూమ్స్‌ ప్రభావంతో చేనేత రంగాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.

చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎస్‌ఎంఈలను) ప్రోత్సహించడం కోసం పథకాలు ప్రవేశపెట్టిన కేంద్రం చేనేత రంగంపై అదనపు భారాన్ని ఎందుకు మోపుతోందో అర్ధంకాని విషయం. ఇంతవరకూ అసంఘటితంగా ఉన్న చేనేత రంగం ఇప్పుడిప్పుడే సంఘటిత రంగంగా రూపుదిద్దుకుంటున్నది. ఈ రంగంలో పనిచేసే కార్మికులు ప్రావిడెంట్‌ ఫండ్‌, బీమా, ఈఎస్‌ఐ పథకాల పరిధిలోకి వస్తున్నారు. చేనేత వస్త్రాలకు తగిన మార్కెటింగ్‌ సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదే. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటి స్థాయి లో చేనేత వస్త్రాల వాడకాన్ని ప్రోత్సహించాల్సి ఉంది. గ్రామీణ, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించేందుకే మహాత్మాగాంధీ ఖాదీ వస్త్రాలను అందరూ ధరించాలని పిలుపు ఇచ్చా రు. అయితే, సొంత రాట్నంపై వడికిన నూలుతో కాకుండా,మరయంత్రాలపై తయారైన నూలుతో ఉత్పత్తి అయిన ఖాదీ వస్త్రాలనే ఆయన వారసులుగా చెప్పుకునే వారు వినియో గిస్తున్నారు. వస్త్ర పరిశ్రమ కొందరి చేతుల్లో బందీ అయిందని చేనేత కార్మికుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement