Monday, June 10, 2024

Record | ఈసీ సరికొత్త రికార్డు.. 9 వేల కోట్ల మేర అక్రమ సొత్తు స్వాధీనం

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరఢా ఝులిపిస్తోంది. గత రికార్డులను అధిగమిస్తూ వేల కోట్ల రూపాయల విలువైన సొత్తును ఈసీ పర్యవేక్షణలో వివిధ దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. నగదు, మాదక ద్రవ్యాలు, మద్యం, ఇతర తాయిలాల రూపంలో ఇప్పటి వరకు రూ. 8,889 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు శనివారం ఈసీ అధికారికంగా ఓ ప్రకటన జారీ చేసింది.

పటిష్టమైన నిఘా, ప్రజల సహకారంతోనే ఈ ప్రలోభాల పర్వానికి అడ్డుకట్ట వేయగలిగామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈసీ స్వాధీనం చేసుకున్న సొత్తులో దాదాపు సగ భాగం (45శాతం) మాదక ద్రవ్యాల రూపంలోనే ఉందని తెలిపింది. మాదక ద్రవ్యాలు, ఇతర మాఫియా కార్యాకలాపాల ద్వారా సమకూర్చుకున్న డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఈసీ పేర్కొంది.

నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో వంటి జాతీయ దర్యాప్తు సంస్థలో కొందరిని నోడల్‌ అధికారులుగా నియమించి డ్రగ్స్‌ రవాణాపై ఉక్కుపాదం మోపినట్టు ఈసీ వెల్లడించింది. అవన్నీ సత్ఫలితాలనిచ్చాయని, ఈ క్రమంలో ఇప్పటి వరకు రూ. 3,958 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని ఈసీ ప్రకటనలో స్పష్టం చేసింది.

ఈ క్రమంలో కొన్ని భారీ ఆపరేషన్లను ఈసీ ఉదహరించింది. భారత సముద్ర జలాల్లో ప్రవేశించిన పాకిస్థానీ ఫిషింగ్‌ బోట్‌ అల్‌-రజాలో 78 బాక్సుల్లో ప్యాక్‌ చేసిన 86 కేజీల హెరాయిన్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. వీటి మార్కెట్‌ విలువ రూ. 602 కోట్లుగా లెక్కించింది.

మరో ఆపరేషన్లో గుజరాత్‌లోని గాంధీనగర్‌, అమ్రేలీ ప్రాంతాలతో పాటు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌, సిరోహ ప్రాంతాల్లో ఏకకాలంలో జరిపిన దాడుల్లో 22 కేజీల మెఫిడ్రోన్‌ పౌడర్‌, 124 లీటర్ల మెఫిడ్రోన్‌ లిక్విడ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ. 230 కోట్లుగా లెక్కించింది. ఈ గణాంకాలన్నీ మోడల్‌ కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత స్వాధీనం చేసుకున్న సొత్తుకు సంబంధించినవని, అంతకంటే ముందు జనవరి, ఫిబ్రవరి మాసాల్లో రూ. 6,760 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నామని ఈసీ పేర్కొంది.

- Advertisement -

స్వాధీనం చేసుకున్న సొత్తులో నగదు రూపంలో రూ. 849.15 కోట్లు ఉండగా, మద్యం రూపంలో రూ. 814.85 కోట్లు, బంగారం, వెండి తదితర ఖరీదైన లోహాల రూపంలో రూ. 1,260.33 కోట్లు, బహుమతులు, ఇతర తాయిలాల రూపంలో రూ. 2,000.59 కోట్లు అని ఈసీ తెలిపింది. రాష్ట్రాలవారీగా చూస్తే అత్యధికంగా గుజరాత్‌ నుంచి రూ. 1,461.73 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకోగా.. రాజస్థాన్‌ రూ. 1,133.82 కోట్లు, పంజాబ్‌ రూ. 734.54 కోట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలో రూ. 333.55 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకోగా.. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 301.75 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement