Saturday, May 25, 2024

శ్రీకాళహస్తీశ్వరా శతకం

88.
రాజశ్రేణికిన్ దాసులై సిరుల( గోరంజేరగాసౌఖ్యమో
యీ జన్మంబుతరింపజేయగల నిన్నే ప్రొద్దు సేవించు ని
నిర్వ్యాజాచారముసౌఖ్యమూ తెలియ లేరా మానవుల్పాపరా
జీజాతాతిమదాంధబుద్ధులగుచున్శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, రాజశ్రేణికి – రాజుల సమూహానికి, దాసులు – ఐ – సేవకులై, సిరుల్ – కోరన్ – సంపదలు అడగటానికి, చేరగా – చేరితే, సౌఖ్యము – ఓ – సుఖం అవుతుందో, ఈ జన్మంబు – ఈ పుట్టుకను, తరింపన్ – చేయన్ – కల – దాటేట్టుచేయ గల, నిన్ను – నిన్ను, ఏ ప్రొద్దున్ -ఎల్లప్పుడూ, సేవించు – భజించే / కొలిచే, నిర్వ్యాజ – ఆచారము – కారణం లేని ( ప్రయోజనం ఏది ఆశించని) ఆచరణం, (నిష్కల్మషమైన సేవ), సౌఖ్యము – ఓ – సుఖమా?, పాపరాజీ – పాపాల సమూహాల వలన, జాత – పుట్టిన, అతిమద – మహాగర్వంతో, అంధబుద్ధులు – అగుచున్ – గ్రుడ్డిదైనబుద్ధికలవారై, మానవుల్ – మనుషులు, తెలియలేరు – ఆ – తెలిసికొన లేక పోతున్నారా?

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! పాపకార్యాలు చేయటం వల్ల పుట్టిన మహాగర్వం చేత గ్రుడ్డిదైనబుద్ధికలవారై (బుద్ధిలేనివారై) మానవులు సౌఖ్య మంటే రాజులకు దాసులై సంపదలను కోరి వారిని సేవించటమో, లేక యీ జన్మల నుండి తరింప చేయగల నిన్ను ఎల్లప్పుడూ ప్రయోజన మేదీ ఆశించక సేవించటమోతెలుసుకోలేకుండా ఉన్నారు.

విశేషం:
లోకులు బుద్ధిహీనులవటం చేత తమకి సుఖం దేనివల్ల వస్తుందో గ్రహించ లేకుండా ఉన్నారు. రెండూ సేవలే. రాజసేవ వల్ల భౌతిక సంపదలు, రాజమౌళి సేవ వల్ల జన్మని తరించటం కలుగుతాయి. రాజసేవలో సంపదలని ఆశించటం ఉంది. పరమేశ్వరుడ సేవలో భక్తి తప్ప ప్రయోజన మేదీ ఆశించటం ఉండదు.

డాక్టర్ అనంతలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement