Saturday, May 25, 2024

మనిషి.. మనసు… బుద్ధి…

మనిషి మనసును సన్మార్గంలో నడిపించేది బుద్ధి. బుద్ధి సన్మార్గంలో నడిపించకపోతే మనిషిని మనస్సు చెడు మార్గాల వెంబడి పరుగులు తీయిస్తుందని పెద్దలు చెబు తారు. ఇదే కఠోపనిషత్తులో చెప్పబడిన విషయాల సారమని కూడా అంటారు. శ్రీరామభక్తుడైన గోస్వామి తులసీదాసు తన భార్య రత్నావళి పేరుతో రాసిన కావ్యంలో ‘మనిషి.. మనసు… బుద్ధి’ గురించి చెప్పిన పద్యం-
”సుమతి కుమతి సబ్‌కే ఉర్‌ రహహి
పురాన్‌ నిగమ్‌ అస్‌ కహ హిఁ
జహాఁ సుమతి తహ్‌ఁ సంపతి నానా
జహాఁ కుమతి తహ్‌ఁ విపతి నిదానా”
”మనిషి మనస్సులో అంతర్భాగంగా ఉన్న బుద్ధి రెండు విధాలుగా పనిచేస్తుంది. మంచివైపు ప్రేరణ కలిగించేది సుబుద్ధి అయితే చెడు మార్గాల గుండా నడిపించేది కంబుద్ధి. సద్బుద్ధితో మనిషి సుఖశాంతులు పొందగలిగితే దుర్బద్ధితో అష్టకష్టాలు కొని తెచ్చుకుంటాడని వేద పురాణాలు ఘోషిస్తున్నాయి” అంటాడు తులసీదాసు.
బలమైన కోరికలతో మనస్సు బుద్ధిపై అధికారం చెలాయించి నప్పుడు బుద్ధి మనసు మాట వినక తప్పదు అనేది పద్యంలోని అంతరార్థంగా అర్థమవుతుంది. మహాభారతంలో కౌరవులను ఇం దుకు ఉదాహరణగా చూపవచ్చు.
”నాకు ధర్మం గురించి బాగా తెలుసు కానీ, ధర్మబద్ధంగా నడు చుకోవాలని అనిపించదు” అంటాడు దుర్యోధనుడు ఓ సందర్భం లో. బలమైన రాజ్య కాంక్షే కౌరవులను చెడుమార్గాల్లో నడిపించి వారిని నాశనం చేస్తుందనేది అందరికి తెలిసిన విషయమే!
నవయుగ వైతాళికుడైన స్వామి వివేకానంద ”అనాలోచితం గా ఏ పనిచేయకు. బుద్ధినుపయోగించి వివేకవంతంగా చేయి. నీవు చేసే పని ఇతరులకు మేలు కలిగించేదిగా ఉండాలి కానీ, కీడు తల పెట్టేదిగా ఉండకూడదు” అంటాడు.
మహాత్మా కబీరు ఓ పద్యంలో ”మనిషి ఎంత విద్యావంతు డు, జ్ఞానపరుడైనా వివేచనాపరుడు కాకపోతే ఆయన అభ్యసించిన విద్య అంతయు బూడిదలో పోసిన పన్నీరే! అందుకే చేసే పని వివేచ నాత్మకంగా చేయాలి” అంటాడు.
”మనిషి అదుపులో లేని మనసు అహంకారంతో నిండి ఉం టుంది” అంటాడు చాణక్యుడు.
చాణక్యుని మాటలకు అద్దంపట్టేది నహుషుని కథ- నహు షుడు చంద్రవంశంలో జన్మించిన గొప్ప రాజు. దానధర్మాలతో, యజ్ఞయాగాదులతో యయాతి వంటి పుత్రులతో ప్రపంచ మంత ట వేనోళ్ల కీర్తింపబడినవాడు. అలా ఆయన కీర్తి ప్రతిష్టలు ఇంద్ర లోకానికి చేరుతాయి. ఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుని సంహరించాడు. దానివల్ల తనకు పాపం చుట్టుకున్నదని భావించి కొన్నేళ్లపాటు నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఒక కమలంలో ఉం డిపో వాలని నిశ్చయించుకుంటాడు. కానీ ఇంద్రుడు వచ్చేవరకు ఇంద్ర పదవిని అధిష్టించేది ఎవరు అన్న సమస్య మొదలైంది. అష్టదిక్పాలకులంతా ఆలోచించి అందుకు సమర్థుడైనవాడు కీర్తి ప్రతిష్టలు గల నహుషుడే అని భావించి రాజైన నహుషునికి ఇంద్ర పదవిని కట్టబెట్టారు.
ఇంద్ర పదవి చేపట్టి నహుషుడు మొదట్లో బాగానే ప్రవర్తిం చడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఇంద్రుని భార్య అయిన శచీదేవి కనిపించింది. అప్పుడు నహుషుడు, ”ఇంద్ర పదవి నాదే అయిన ప్పుడు ఇక ఇంద్రుని భార్య కూడా నాదే కావాలి కదా!” అనుకున్న అతడు మనసులోని మాటను శచీదేవికి తెలియజేసాడు. ఆమె, ఏమి చేయాలో అర్థంగాక దేవతల గురువు బృహస్పతికి నహుషుని మాటలు వినిపించి ఏంచేయాలో సలహా కోరింది. ”బృహస్పతి ఏ మదంతో అయితే నహుషుడు మునితేలుతున్నాడో ఆ మదంతోనే అతన్ని జయించాలి” అని ఒక సలహా ఇచ్చాడు. బృహస్పతి సలహా మేరకు శచీదేవి నహుషునికి ”ఇంద్ర పదవిలో ఉన్న నీవు గొప్ప రుషులచే పల్లకీని మోయించుకుంటూ రా!” అని కబురు పంపింది.
”ఓస్‌! ఇంతేకదా అనుకున్న నహుషుడు అగస్త్యుడు మొదలైన రుషులందరి చేత పల్లకీని మోయించాడు. అసలే ఇంద్రపదవి. ఆపై తన సొంతంకానున్న శచీదేవి! నహుషుని సంబరానికి అంతు లేకుండాపోయింది. శచీదేవిని చేరుకునేందుకు అతని మనసు ఉవ్విళ్లూరుతోంది. ఆ తొందరలో పల్లకీని మోస్తున్న అగస్త్యుని కాలితో ఒక్క తన్ను తన్ని ”సర్ప…సర్ప” (త్వరగా, త్వరగా) అంటూ ఆయన్ని తొందరపెట్టాడు. ఆ అవమానాన్ని అగస్త్యుడు ఓర్చులో లేక ”సర్ప… సర్ప అంటున్న నువ్వు, సర్పానివై భూలోకాన పడి ఉందువుగాక” అంటూ శపించాడు. మనసు కోరిన కోరిక తీర్చు కోవడానికి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి మూర్ఖంగా ప్రవర్తించిన నహుషునికి తగిన ఫలితం లభించింది. అందుకే మనిషి మనసు, మాట కాదు. బుద్ధి చెప్పే మాట వినాలంటారు అనుభవజులు.
నేడు ప్రతి ఒక్కరు మనసులో వచ్చిన ఆలోచనను విచక్షణా జ్ఞానంతో విశ్లేషించుకొని ఆచరించడం లేని కారణంతోనే శారీకంగా మానసికంగా నష్టపోతున్నారు. ఈ విషయంలో మన పురాణతి హాసాలు ”మనిషి… మనసు… బుద్ధి” అనే వటిపై ఎరుక కలిగి ఉండాలంటాయి.
– పరికి పండ్ల సారంగపాణి
98496 30290

Advertisement

తాజా వార్తలు

Advertisement