Saturday, May 25, 2024

అన్నమయ్య సంకీర్తనలు

నారాయణాచ్యుత

నారాయణాచ్యుతానంత గోవింద హరి
సారముగ నీకు నే శరణంటిని || ||నారాయణాచ్యుత ||

చలువయును వేడియును సటల సంసారంబు
తొలకు సుఖమొకవేళ దు:ఖమొక వేళ
ఫలములివె ఈ రెండు పాపములు పుణ్యములు
పులుపు తీపును కలిపి భుజియించినట్లు || ||నారాయణాచ్యుత ||

పగలు రాత్రుల రీతి బహుజన్మ మరణాలు
తగు మేను పొడచూపు తనుతానె తొలగు
నగియించు నొకవేళ నలగించు నొకవేళ
వొగరు కారపు విడెము ఉబ్బించినట్లు || ||నారాయణాచ్యుత ||

యిహము పరమునువలెనె యెదిటి కల్లయు నిజము
విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని
సహజ శ్రీవేంకటేశ్వర నన్ను కరుణింప
బహువిధంబులు నన్ను పాలించవే || ||నారాయణాచ్యుత ||

Advertisement

తాజా వార్తలు

Advertisement