Tuesday, May 14, 2024

జూన్ 1 నుంచి నిలిచిపోనున్న గ్యాస్ హోం డెలివరీ

హైదరాబాద్: కరోనా కేసుల నేపథ్యంలో తమను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలని వంటగ్యాస్ పంపిణీదారులు కోరుతున్నారు. దీంతో ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేసింది. ఎల్పీజీ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇప్పించాలని అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.వెంకటేశ్వరరావు, కె.జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో జూన్ 1 నుంచి సిలిండర్ సరఫరా నిలిపివేస్తామని డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరించారు. దీంతో వినియోగదారులు గోడౌన్ల నుంచే సిలిండర్లు తెచ్చుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు.


కోవిడ్‌ కారణంగా ఇప్పటికే అనేక మంది పంపిణీదారులు వైరస్‌ బారిన పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది ప్రాణాలను ఫ‌ణంగా పెట్టి ఇంటింటికీ వెళ్లి ఎల్పీజీ సిలిండర్లు అందజేయాల్సి ఉంటుందన్నారు. తాము రాష్ట్రంలో రోజుకు రెండు లక్షల గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. మరోవైపు వంట గ్యాస్ డెలివరీ సిబ్బందిని ఫ్రంట్ లైన్ కార్మికులుగా గుర్తిస్తూ అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ సిలిండర్లను డెలివరీ చేసే బాయ్స్ లను ఫ్రంట్ లైన్ కార్మికులుగా గుర్తించి వారికి త్వరలో కొవిడ్ టీకాలు వేయడం ప్రారంభిస్తామని అసోం ప్రభుత్వం ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాలైన అసోంతో పాటు మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలోనూ ఎల్పీజీ డెలివరీ సిబ్బందిని ఫ్రంట్ లైన్ కార్మికులుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement