Friday, May 31, 2024

Anasuya Sen : కేన్స్ లో సంచ‌ల‌నం… భార‌తీయ న‌టికి ఉత్త‌మ హీరోయిన్ అవార్డు

77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ అట్టహాసంగా సాగుతోంది. ఇందులో భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా చ‌రిత్ర సృష్టించారు.
‘అన్‌ సర్టెయిన్‌ రిగార్డ్‌’ విభాగంలో ఉత్తమ నటి గా అవార్డు అందుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవంలో అవార్డు గెలిచిన తొలి భారతీయురాలిగా అరుదైన ఘనత సాధించారు.

బల్గేరియన్‌ దర్శకుడు కాన్‌స్టాంటిన్‌ బొజనోవ్‌ తెరకెక్కించిన ది షేమ్‌లెస్ చిత్రానికి గానూ ఆమె ఈ అవార్డు అందుకున్నారు. ఇందులో ‘రేణుక’ అనే సెక్స్‌ వర్కర్‌ పాత్ర పోషించారు. ఈ సినిమాను భారత్‌, నేపాల్‌లో నెలన్నర రోజుల పాటు చిత్రీకరించారు. తాజాగా జరుగుతున్న కేన్స్‌ ఉత్సవానికి ఈ చిత్రం ఎంపికయింది. ఈ వేడుకల్లో దీన్ని ప్రదర్శించగా.. వీక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.

- Advertisement -

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాకు చెందిన అనసూయ కొన్నేళ్ల నుంచి సినీ రంగంలో ఉన్నారు. ముంబయిలో ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వ్యవహరించేవారు. దర్శకుడు బొజనోవ్‌ ఆమెకు ఫేస్‌బుక్‌ స్నేహితులు. ఒకసారి ఆడిషన్‌ టేప్‌ పంపమని అనసూయకు చెప్పారు. అది నచ్చడంతో ‘ది షేమ్‌లెస్‌’లో అవకాశమిచ్చారు. అలా నటిగా వెండితెరకు పరిచయమైన అనసూయ తొలి ప్రయత్నంలోనే కేన్స్‌లో అవార్డు అందుకోవడం విశేషం.

సినిమా కథేంటంటే..?

ఈ సినిమాలో అనసూయ.. ‘రేణుక’ అనే వేశ్య పాత్ర పోషించారు. దిల్లీలోని ఓ బ్రోతల్‌ హౌస్‌లో పోలీసును చంపి రేణుక పారిపోతుంది. మరో రాష్ట్రంలో సెక్స్‌ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం పొందుతుంది. అక్కడ 17ఏళ్ల దేవికతో ఆమె ప్రేమలో పడుతుంది. అడ్డంకులను అధిగమించి వీరిద్దరూ తమ జీవితాలను ఎలా కొనసాగించారన్నదే ఈ సినిమా కథా నేపథ్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement