Monday, June 10, 2024

TG | ఓట్ల లెక్కింపు సజావుగా జరగాలి : ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్

లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ సిబ్బందికి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్‌ పలు సూచనలు చేశారు. జూన్‌ 4వ తేదీన లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా కౌంటింగ్‌ సిబ్బంది తమ విధులను సమర్ధంగా నిర్వర్తించాలని చెప్పారు.

బంజారాహిల్స్‌లోని కుమురంభీం భవనంలో శనివారం మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్స్‌, ఏఆర్‌వోలకు కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగానే రొనాల్డ్ రాస్ పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ఉదయం 8:00 గంటలకు ప్రారంభమవుతుందని, నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించాలన్నారు.

ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని రొనాల్డ్ రాస్ తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు అందుబాటులో ఉండి సరి చేస్తారని వెల్లడించారు.

జిల్లాలో ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ చెప్పారు. సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని సెగ్మెంట్లలో ఓట్ల లెక్కింపు కోసం ప్రతి హాల్ లో 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నామని రొనాల్డ్ రాస్ చెప్పారు.

రౌండ్ల వారీగా కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. ప్రతి టేబుల్ కు ఒక మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారని ఆయన వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పారదర్శకంగా కౌంటింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమైనదని, మైక్రో అబ్జర్వర్లు రౌండ్ వారీగా ప్రతి రిపోర్ట్ ను ఎన్నికల అబ్జర్వర్లకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

- Advertisement -

కౌంటింగ్ ప్రక్రియలో ఏ సమస్య ఉన్న ఏఆర్ఓ కు తెలుపాలని ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ సూచించారు. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవు అని స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. నిబంధనలను పాటిస్తూ, పూర్తి పారదర్శకంగా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement