Monday, June 24, 2024

Fake Seeds – ఏపీ నుంచి ఫేక్ సీడ్స్ …. పత్తి రైతులకు తప్పని గోస

ఉమ్మడి కరీంనగర్, ప్రభ న్యూస్ బ్యూరో : ఆరుగాలం శ్రమించే రైతులు న‌కిలీ విత్త‌నాల‌తో కుదేలు అవుతున్నారు. విత్త‌నాలు వేసినా అవి మొలకెత్తుతాయన్న ఆశ లేదు. కొంద‌రు వ్యాపారుల వ‌ల్ల రైతుల‌కు న‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మారుమూల గ్రామాల రైతులను ల‌క్ష్యంగా పెట్టుకుని న‌కిలీ విత్త‌నాలు విక్ర‌యిస్తున్నారు. జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాలో నిషేధిత పత్తి విత్తనాలు అమ్మే ముఠాలు త‌న కార్య‌క‌లాపాలు సాగిస్తున్నారు. విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు గ్రామాల్లోకి ఇప్పటికే చేరాయ‌ని తెలిసింది. ఈ ముఠాలు చేతిలో ప‌డి గ్రామీణ రైతులు మోస‌పోతున్నారు. ఏటా ఇదేతంతు జరుగుతున్నా ప్రారంభం ద‌శ‌లో అధికారుల నిఘా కొరవడుతుంది.

త‌నిఖీల్లో బ‌య‌ట‌ప‌డుతున్న వైనం
న‌కిలీ విత్త‌నాల‌తో రైతులు న‌ష్ట‌పోతున్న త‌రుణంలో అధికారులు, పోలీసులు త‌నిఖీలు చేప‌ట్టారు. దీంతో న‌కిలీ విత్త‌నాలు భారీ స్థాయిలో బ‌య‌ట ప‌డుతున్నాయి.దుర్షెడ్ గ్రామం వద్ద కరీంనగర్ టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, రూరల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం కోయవారిపాలెం గ్రామానికి చెందిన, ప్రస్తుతం మంచిర్యాల జిల్లా వారం గ్రామంలో నివాసం ఉంటున్న చందు నాగేశ్వరరావు అనే వ్యక్తి నుండి పన్నెండు లక్షల రూపాయల విలువ చేసే 60 కేజీల నకిలీ పత్తి విత్తనాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 420, 3(1) ఆఫ్ సీడ్స్ యాక్ట్, సెక్షన్ 8, 15(1) ఆఫ్ సీడ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అలాగే ఉమ్మ‌డి జిల్లాల్లో విక్ర‌యానికి సిద్ధంగా ఉంచిన రూ.15 ల‌క్ష‌ల విలువైన 380 కిలోల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది 12 పీడీయాక్ట్‌ లు, 35 కేసులు నమోదుచేశామని అధికారులు చెబుతున్నారు.

గ్రామీణ రైతులే ల‌క్ష్యంగా…
మారుమూల గ్రామాల రైతులను వ్యాపారులు ల‌క్ష్యంగా పెట్టుకుని న‌కిలీ విత్త‌నాలు అంట‌గ‌డుతున్నారు.
ప్రారంభ ద‌శ నుంచి వ్యవసాయశాఖ నిఘా లేకపోవడంతో న‌కిలీ విత్త‌నాల‌ను విచ్చ‌ల‌విడిగా విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ఏదో చేస్తామ‌ని చెప్పినా నకిలీ రాయుళ్ళ ఆగడాలు మాత్రం అంతులేకుండా పోతుంది.

- Advertisement -

మూలాలు గాలికొదిలేశారు…
సీజ‌న్‌లో ప్ర‌తి ఏటా ఇదే తంతు జ‌రుగుతుంది. న‌కిలీ విత్త‌నాల‌తో రైతులు బేజార‌వుతున్నారు. కొంత మంది రైతులు న‌ష్ట‌పోయారు. కేవలం ఎరువులు, సీడ్‌ దుకాణాల్లో మాత్రమే తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. లాభాపేక్ష కోసం కొంత మంది నకిలీ విత్తనాలను విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా నకిలీ విత్తనాలను నిల్వ చేసి విక్రయిస్తున్నారు. అయితే ఈ న‌కిలీ విత్త‌నాలు బేజారు త‌గ్గించ‌డానికి మూలాలు మాత్రం అధికారులు అన్వేషించ‌డ లేదు.

ఏపీ నుంచి దిగుమ‌తి…
ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఇక్క‌డ‌కు న‌కిలీ విత్త‌నాలు దిగుమ‌తి అవుతున్నాయి. గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారు కీల‌క‌పాత్ర పోషిస్తున్న‌ట్లు అధికారుల విచార‌ణ‌లో తేలుతోంది. ఉమ్మడి జిల్లాలో ప‌ట్టుబ‌డిన వ్యాపారులు ఆ మూడు జిల్లాల‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. వీరంతా గ్రామాల్లో కొందరికి డబ్బులు ఆశ చూపి నేరుగా రైతులకు నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రామాల్లోకి నకిలీ విత్తనాలను ఆంధ్ర నుంచి భారీగా డంప్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

విభిన్న ర‌కాల కంపినీల విత్త‌నాలు వినియోగించాలి : క‌లెక్ట‌ర్‌
సాగు కోసం విభిన్న రకాల కంపెనీల పత్తి విత్తనాలను వినియోగించాల‌ని, ఒకే ర‌కంగా ఆధార‌ప‌డితే న‌కిలీ బెడ‌ద ఎక్కువ‌గా ఉంటుంద‌ని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్‌ లోని గాంధీ రోడ్‌ లో విత్తనాలు, పురుగుమందుల దుకాణాలను ఇటీవ‌ల‌ తనిఖీ చేశారు. క్షుణ్ణంగా ప‌రిశీలించారు. లైసెన్సులు కలిగిన వ్యాపారుల వద్దే విత్తనాలు, పురుగు మందులను కొనుగోలు చేయాలన్నారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే సహించేది లేదని, ఎవరైనా విక్రయించినా, సరఫరా చేసినా వారిపై పీడీ యాక్ట్‌ అమలు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement