Saturday, July 27, 2024

Swearing Cermony – సందడే సందడి…. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి గన్నవరంలో జోరుగా సాగుతున్న ఏర్పాట్లు …

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) ఢిల్లీలో మోదీ 3.0 హ్యాట్రిక్ పట్టాభిషేకం… మంత్రుల ప్రమాణ స్వీకారం సీన్ కట్ చేస్తే… ఏపీలో కూటమి సర్కారు ప్రమాణోత్సవానికి గన్నవరం వేదికగా… స్క్సీన్ ప్లే బిజీ బిజీగా మారింది. సీఎం ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చక చక జోరందుకున్నాయి. కేసరపల్లిలోని మేధాటవర్ పక్కన 14 ఎకరాల స్థలంలో .. భారీ ఏర్పాట్లల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమానికి ఇంకా 48 గంటల సమయమే ఉంది. ఈ నెల 12న ఉదయం 11 గంటల 27నిమిషాలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత ఈ స్థలం సరిపోదని, మంగళగిరి ఎయిమ్స్ ప్రాంతంలో నిర్వహిద్దామని భావించారు. కానీ.. భారీ స్థాయిలో అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి విచ్చేసే అతిథి దేవుళ్లకు సకల సదుపాయాలకు గన్నవరం మాత్రమే మహా వేదికగా ప్రభుత్వం భావించింది. పక్కనే విమానాశ్రయం, జాతీయ రహదారి ఉండటంతో… కార్లు, బస్సులు, లారీలు రాకపోకలే కాదు.. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు పార్కింగ్ సదుపాయాల కల్పన సులభం కావటంతోనే గన్నవరాన్నే వేదికగా నిర్ణయించారు.

అధికారులు బిజీబిజీ

భారీ స్థాయిలో జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సహా అనేక మంది దేశీయ, విదేశీ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. అందుకే కట్టుదిట్టమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. గన్నవరం విమానాశ్రయంలో వీవీఐపీలు, వీఐపీల విమానాలు, హెలికాప్టర్లకు పార్కింగ్ కు ఏర్పాట్లు చేయాలని ఎయిర్ పోర్ట్ అధికారులకు సీఎస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే కేంద్ర, ఇతర రాష్ట్రాల ప్రజా ప్రతినిధుల వాహనాల పార్కింగ్‌కు తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ.కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శులు ఎం.రవిచంద్ర, శశి భూషణ్ కుమార్, అదనపు డీజీపీ ఎస్.బాగ్చి, టీఆర్ అండ్ బీ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్నా, పౌరసరఫరాలు, ఉద్యానవన శాఖల కమిషనర్లు అరుణ్ కుమార్,శ్రీధర్, సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, ఏపీ జెన్కో సీఎండీ చక్రధర్ బాబు అదితర రాష్ర్టస్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఇక క్షేత్ర స్థాయిలో వేదిక నిర్మాణాలు, బందోబస్తు వ్యవహారాలను కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ అద్నాన్ నయీయ్ పర్యవేక్షిస్తున్నారు. కృష్ణాజిల్లా యంత్రాంగం మొత్తం గత రెండు రోజులుగా అహర్నిశం వేదిక ఏర్పాట్లల్లో తలమునకలైంది.

- Advertisement -

మూడు ప్రత్యేక గ్యాలరీలు:
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని బృందం పర్యవేక్షణలో సభా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు వీఐపీ, వీఐపీ+, మరో మూడు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమానికి హాజరయ్యే అతిథుల వాహనాల పార్కింగ్కు గన్నవరం అయిదు ప్రాంతాల్లోని 65 ఎకరాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు.

రెయిన్‌ ఫ్రూఫ్‌ షెడ్లు

భారీ వర్షం వెంటాడినా ప్రమాణస్వీకారోత్సవానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం అల్యూమినియంతో కూడిన పటిష్టమైన రెయిన్‌ ఫ్రూఫ్‌ షెడ్లను వేస్తున్నారు. సుమారు 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ+ గ్యాలరీ ఉంటుంది. మిగిలిన 11.5ఎకరాల్లో వీఐపీ, నేతలు, ప్రజలకు నాలుగు గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంతో పాటు వెలుపలి వైపు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. భారీ విద్యుత్తు దీపాలతో పాటు సభ జరిగే సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.

ప్రముఖుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

విమానాశ్రయానికి అభిముఖంగానే సభా వేదిక ఉండటంతో హెలీప్యాడ్‌ల అవసరం లేదు. నేరుగా ప్రముఖులు సభా ప్రాంగణానికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. విమానాశ్రయం ప్రధాన గేట్‌ నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా ప్రాంగణం వద్దకు ప్రధాని నరేంద్రమోదీ, పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ప్రముఖుల రాకకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయం ప్రహరీని ఆనుకొని ఉన్న కేసరపల్లి గ్రామంలోని పెట్రోల్‌ బంక్‌ వెనుక భాగంలో వీవీఐపీ వాహనాల పార్కింగ్‌కు కేటాయించారు. పార్కింగ్‌ ప్రదేశాల నుంచి వేదిక వద్దకు చేరుకునేలా ప్రత్యేకంగా అప్రోచ్‌ రహదారులను సిద్ధం చేస్తున్నారు.

సదుపాయాల కల్పనలో…

ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రత్యేక అధికారులుగా నియమించిన ఐఏఎస్‌లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల ఉన్నతాధికారుల సమన్వయంతో పర్యవేక్షణ బృందం దగ్గరుండి ఏర్పాట్లను చేయిస్తోంది. పనుల్లో వేగం పెంచాలని ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా పటిష్టంగా చేపట్టాలని సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ అధికారులకు సూచించారు. పార్కింగ్‌ స్థలాలు, ప్రధాన సభకు చేరుకునేందుకు వీలుగా అప్రోచ్‌ రహదారులను పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. వైద్య శిబిరాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను పెద్దసంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

10 వేల మంది పోలీసులతో బందోబస్తు

గుంటూరు, ఏలూరు రేంజ్‌లు, విజయవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఉన్నతాధికారులు, సిబ్బంది సహా దాదాపు 10 వేల మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. మోదీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌-ఎస్పీజీ బృందం ఇప్పటికే విజయవాడ చేరుకుంది. చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ప్రముఖుల కోసం విజయవాడ నగరంలోని పెద్ద హోటళ్లలోని గదులన్నింటినీ ప్రభుత్వం బుక్‌ చేసింది. ఈనెల 11, 12 తేదీల కోసం ముందుగానే ప్రభుత్వ సాధారణ పరిఫాలన శాఖ ఆధ్వర్యంలో గదులను బుక్‌ చేశారు.

ట్రాఫిక్ మళ్లింపు ఇలా

విశాఖ పట్నం టూ చెన్నై

1 .కత్తిపూడి నుంచి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు.
2 . విశాఖపట్నం నుండి చెన్నై వెళ్లి వచ్చే వాహనాలను కత్తిపూడి నుండి ఒంగోలు వైపు మళ్లించారు.

చెన్నై టూ విశాఖపట్నం

1 .ఒంగోలు నుంచి రేపల్లె మీదుగా వయ మచిలీపట్నం – లోసర్ బ్రిడ్జి – నరసాపురం – అమలాపురం – కాకినాడ – కత్తిపూడి మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించారు.
2 . బుడంపాడు నుంచి తెనాలి – పులిగడ్డ – మచిలీపట్నం – లోసర్ బ్రిడ్జి – నర్సాపురం – కాకినాడ – కత్తిపూడి వైపు మళ్లించారు.

విశాఖపట్నం నుంచి హైదరాబాద్ _

1 . గామన బ్రిడ్జి – దేవరపల్లి – జంగారెడ్డిగూడెం – అశ్వరావుపేట – ఖమ్మం మీదుగా హైదరాబాద్
2 . భీమడోలు – ద్వారకాతిరుమల – కామవరపుకోట – చింతలపూడి నుండి ఖమ్మం వైపు
3 . ఏలూరు బైపాస్ నుండి – జంగారెడ్డిగూడెం మీదుగా అశ్వరావుపేట – ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు.

4 . ఏలూరు బైపాస్ – చింతలపూడి నుండి సత్తుపల్లి మీదుగా.
5 . హనుమాన్ జంక్షన్ – నూజివీడు, మైలవరం – ఇబ్రహీంపట్నం – నందిగామ మీదుగా హైదరాబాద్ వైపు మళ్లింపు

హైదరాబాద్ నుంచి విశాఖపట్నం

1 . నందిగామ – మధిర – వైరా – సత్తుపల్లి – అశ్వరావుపేట – జంగారెడ్డిగూడెం – దేవరపల్లి – గామన బ్రిడ్జి మీదుగా విశాఖపట్నం వైపు
2 . ఇబ్రహీంపట్నం – మైలవరం – నూజివీడు – హనుమాన్ జంక్షన్ నుంచి ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు.

3 . రామవరప్పాడు – నున్న – పాముల కాలువ – వెలగలేరు – జి.కొండూరు – మైలవరం – నూజివీడు – హనుమాన్ జంక్షన్ – ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు.
4 . విజయవాడ నుండి ఎనికేపాడు మీదుగా 100 అడుగుల రోడ్డు – తాడిగడప – కంకిపాడు – పామర్రు – గుడివాడ నుండి భీమవరం వైపు
ఈ ట్రాఫిక్ మల్లింపును దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు సహకరించాలని సహకరించాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement