Saturday, April 27, 2024

పేటీఎం మనీతో ఎల్‌ఐసీకి బిడ్డింగ్‌..

రాబోయే ఎల్‌ఐసీ ఐపీవో కోసం పేటీఎం మనీ ఓ సరికొత్త ఫీచర్‌ను ప్రకటించింది. హ నెట్‌వర్త్‌ ఇండివీడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ) రూ.5లక్షల వరకు విలువైన షేర్ల కోసం యూపీఐద్వారా బిడ్డింగ్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 5న మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే ఈ సదుపాయాన్ని తెచ్చామని పేటీఎం మనీ ఈ సందర్భంగా తెలిపింది. ఇప్పటివరకు ఒక్కో ఇన్వెస్టర్‌కు రూ.2లక్షల వరకే ఈ సౌకర్యం ఉన్నది. ఇప్పుడు దాన్ని సెబీ రూ.5లక్షలకు పెంచింది. కాగా మినిమం పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ నిబంధన నుంచి ఎల్‌ఐసీకి మినహాయింపుపై మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చిస్తుందని దీపం కార్యదర్శి పాండే తెలియజేశారు. స్టాక్‌ మార్కెట్‌లో లక్ష కోట్ల రూపాయలకుపైగా విలువతో నమోదైన సంస్థలు లిస్టింగైన ఐదేండ్లలోపు కనీసం 25 శాతం పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ను కలిగి ఉండాలన్నది సెబీ నిబంధన. అయితే ఈ నిబంధన నుంచి నిరుడు ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం మినహాయింపునిచ్చింది. అలాగే సెబీ నిబంధనల ప్రకారం లక్ష కోట్ల రూపాయలకుపైగా విలువైన సంస్థలు ఐపీవోలో కనీసం 5 శాతం వాటానైనా విక్రయించాల్సిందే.

కానీ ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటానే కేంద్రం అమ్ముతున్నది. దీంతో మార్కెట్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 శాతం వాటా సాధ్యం కాకపోవచ్చని పాండే అన్నారు. ఈ క్రమంలో ఎల్‌ఐసీ వంటి భారీ సంస్థ కోసం రోడ్‌మ్యాప్‌ను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దీనిపై సెబీతో ఆర్థిక శాఖ చర్చించాల్సిన అవసరం ఉంటుందన్నారు. మరోవైపు 25కుపైగా యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి ఎల్‌ఐసీ ఐపీవోకు ఆసక్తిని అందుకున్నామని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఇందులో దేశీయ, విదేశీ మదుపరులున్నారు. యాంకర్‌ ఇన్వెస్టర్లుసహా క్యూఐపీల కోసం ఆఫర్‌లో 50 శాతం రిజర్వ్‌ చేశామని లీడ్‌ మేనేజర్లలో ఒకరు చెప్పారు. ఇందులో 30 శాతం యాంకర్‌ ఇన్వెస్టర్లకే కేటాయించామన్నారు. ఇక రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం 35 శాతం, హెచ్‌ఎన్‌ఐల కోసం 15 శాతం, పాలసీదారుల కోసం 10 శాతం షేర్లు కేటాయించారు. మే 2న యాంకర్‌ ఇన్వెస్టర్ల బుకింగ్స్‌ జరుగుతాయి..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement