Sunday, April 28, 2024

స్పైస్‌జెట్‌పై 50 శాతం పరిమితి ఎత్తివేత

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు ఊరట లభించింది. వరస ప్రమాదాలతో ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీసీఏ 50 శాతం సర్వీస్‌లు మాత్రమే నడపాలని స్పైస్‌జెట్‌పై ఆంక్షలు విధించింది. శీతాకాలం షెడ్యూల్‌లో పూర్తి స్థాయిలో విమానాలను నడిపేందుకు కేంద్ర పౌర విమానయాన సంస్థ అనుమతి ఇచ్చింది. వరసగా సాంకేతిక లోపాలు వెలుగు చూడడంతో జులై 27న 50 శాతం విమానాలనే నడపాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆదేశాలను సెప్టెంబర్‌లో మరోసారి పొడిగించింది. అక్టోబర్‌ 30 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 25 వరకు శీతాకాలం షెడ్యూల్‌ను డీజీసీఏ ప్రకటించింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం వారానికి దేశీయంగా 21,941 విమానాలు నడిపేందుకు విమానయాన సంస్థలకు అనుమతి ఇచ్చింది. దేశంలోని 105 విమానాశ్రయాల నుంచి ఈ విమానాలు నడుస్తాయని తెలిపింది. గత సంవత్సరంతో పోల్చితే ఈ సీజన్‌లో 1.55 శాతం తక్కువ సర్వీస్‌లకు డీజీఏసీ అనుమతి ఇచ్చింది. గత సంవత్సరం ఈ సీజన్‌లో 22,287 విమానాలు నడిపేందుకు అనుమతి ఇచ్చింది.

ఈ సారి షెడ్యూల్‌ల్లో ఇండిగో వారంలో 10,085 విమానాలను, స్పైస్‌జెట్‌ 3,193 విమానాలను నడపనున్నాయి. ఎయిర్‌ఇండియా 1990, విస్తారా 1941, ఎయిర్‌ ఏషియా 1462, గో ఎయిర్‌ 1390, అలయన్స్‌ ఎయిర్‌ 1034, ఆకాశ ఎయిర్‌ 479, ఫ్లై బిగ్‌ 214, స్టార్‌ ఎయిర్‌ 153 విమానాలను నడపనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement